
( అక్టోబరు 28 – సోదరి నివేదిత జయంతి )
ఇంగ్లాండ్‌లో స్వామి వివేకానందుడి ప్రసంగాలను విన్న ఓ యువతి తనదిగాని గడ్డ కోసం సర్వస్వం వదిలేసింది. ఆయన వెంట నడిచి పుణ్యభూమిపై అడుగిడింది. భారత్‌నే ఆత్మీయ దేశంగా తలచింది. విశాల హితంతో స్వాతంత్ర్య పోరాటానికి ఆలంబనగా నిలిచింది. భరతమాత చిత్రపటానికి రూపమిచ్చింది. విదేశీ పాలనలో కొడిగడుతున్న భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడేందుకు పుస్తకాలను రచించింది. ఆమే..మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్..అలియాస్ సిస్టర్ నివేదిత.
మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఐర్లాండ్‌లో 1867 అక్టోబరు 28న జన్మించారు. తండ్రి జాన్ నోబెల్ స్థానిక చర్చి ఫాదర్. తండ్రి పేదల దగ్గరికి వెళ్లినప్పుడల్లా ఆమె ఆయన వెన్నంటి ఉండేది. తండ్రి కరుణామయ స్వభావం, తల్లి సేవాగుణం ఆమెలో మానవతా పరిమళాలు నింపాయి. పదిహేడేళ్ల వయసులోనే పాఠశాలలో, అనాథ సదనంలో ఉపాధ్యాయినిగా పనిచేశారు. 1895లో లండన్‌లో లేడీ మార్గెస్సన్ నివాసంలో ఆమె తొలిసారి స్వామి వివేకానందుణ్ని కలిశారు. ఆయన ప్రసంగాన్ని విన్నారు. ‘దేశీయ విద్యావిధానం..దేశీయత, ఆధ్యాత్మిక స్పర్శతో ఉండాలి. మాతృభూమితో అనుసంధానం కావాలి’ అన్న వివేకానందుని బోధనలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి.
స్వామి ఉపన్యాసానికి ప్రభావితురాలైన మార్గరెట్…భారత్‌లో చదువు చెప్పి, అక్కడి సమాజంలో పరివర్తన తీసుకురావాలని తలపోశారు. వెంటనే సన్యాసం స్వీకరించి, ఆయన శిష్యురాలయ్యారు. రామకృష్ణ మిషన్‌లో చేరారు. ‘నివేదిస్తూ, దైవానికి అంకితం కావడం’ అనే అర్థంలో వివేకానందుడు ఆమె పేరును నివేదితగా మార్చారు. 1898 జనవరిలో ఆమె భారత్ వచ్చేశారు. బాలికా విద్య, పేద రోగుల సేవలో జీవితాన్ని గడపాలని నిర్ణయించి కోల్‌కతాలోని బాగ్‌బజారులో రామకృష్ణ మిషన్-సిస్టర్ నివేదిత పాఠశాలను నెలకొల్పారు. దీన్ని శారదామాత స్వయంగా ప్రారంభించారు. ఇంటింటికీ తిరిగి బాలికలను పాఠశాలలో చేర్పించారు. బడిలో వందేమాతరాన్ని ప్రార్థనా గీతంగా ప్రవేశపెట్టారు. బాల్యవివాహాల దురాచారాన్ని రూపుమాపేందుకూ పోరాడారు. 1902లో వివేకానందుడి హఠాన్మరణంతో నివేదిత తీవ్రంగా కుంగిపోయారు. క్రమంగా కోలుకున్నాక ఆమె దృక్పథం మారింది. ఒకవైపు సామాజిక సేవ కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయ ఉద్యమాల వైపు ప్రజలను కదిలించారు.
విదేశీయుల దాస్య శృంఖలాలలో ఉన్న ఏ దేశమైనా జాతీయ పునరుజ్జీవనాన్ని కలలోనైనా ఊహించలేదని సోదరి నివేదిత గ్రహించి దేశభక్తులకు అండగా నిలిచారు. బ్రిటీష్ రాక్షస పాలనను చీల్చి చెండాదుతూ అనేక పత్రికలకు సోదరి నివేదిత వ్యాసాలు రాశారు. యుగాంతర పత్రిక ఉపసంపాదకుడు, వివేకానంద సోదరుడైన భూపేంద్రనాథ దత్త, బారిష్ ఘోష్ మొదలైన విప్లవవీరులు ఆమెను తమ గురువుగా భావించారు. పులిన్ బిహారీ ప్రారంభించిన ప్రసిద్ధ విప్లవ సంస్థ ‘అనుశీలన సమితి’కి ఆమె మార్గదర్శనం చేశారు. అరెస్టు అయిన విప్లవ వీరులను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేవారు. స్వదేశీ- స్వభాష- పట్ల చాలా పట్టుదలతో భారతీయులకు మార్గదర్శనం చేశారు. స్వదేశీ వస్తు వినియోగాన్ని చాటిచెప్పే విధంగా ఆమె స్వయంగా స్వదేశీ వస్తువులను తోపుడు బండిపై పెట్టుకొని అమ్మారు.
భారతదేశ మహిళల సమస్యలను గురించి, భారత దేశానికి స్వాతంత్ర్యం యొక్క ఆవశ్యకతని గురించి విదేశాలలోని భారతీయులకి తన ఉపన్యాసాల ద్వారా సోదరి నివేదిత వివరించారు. ద మదర్, హిట్స్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఎ పిల్‌గ్రిమ్స్ డైరీ, బ్లాక్ ద మదర్, మాస్టర్ ఎడ్జ్‌కేమ్, వెబ్ ఆఫ్ ది ఇండియన్ లైఫ్, ద మాస్టర్ యాజ్ సీన్ హిమ్, కేదార్‌నాథ్ – బదరీనాథ్ వంటి గ్రంథాలను రాశారు. ‘జాతీయ విద్య పై సూచనలు’ గ్రంథంలో భారత విద్యావిధానంలో రావలసిన మార్పులను గురించి చర్చించారు. భారతీయ పరిశోధకులను సైతం సోదరి నివేదిత ప్రోత్సాహించారు. జగదీష్ చంద్రబోస్‌ను ప్రోత్సాహించారు. ఒక శాస్త్రవేత్తగా జగదీశ్ చంద్రబోస్‌కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అందుకు సోదరి నివేదిత చేసిన ఆర్థిక సాయమే కారణం అంటే అతిశయోక్తి కాదు.
రాజకీయాలు, విద్య, కళలు, సాహిత్యం, సమాజశాస్త్రం, ఆధ్యాత్మికత ఇలా అన్ని రంగాలలో సోదరి నివేదిత భారతదేశం పట్ల తనకు ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. శివుడిని నిజంగా కొలవాలంటే మన శివుడు కావాలి. శివో భూత్వా శివం యజేత్. అలాగే నివేదిత భరతమాతలో ఏకమైంది. హిందూజాతిలో మమేకమై తన సర్వశక్తులను అర్పించిన మహనీయురాలు సోదరి నివేదిత 1911 అక్టోబర్ 13న పరమపదించినప్పటికీ జాతీయవాదు లైన మనందరి ఆత్మలలో దేదీప్యంగా వెలుగుతోంది. ఎవరైనా తమ మాతృభూమికి సేవ చేయాలనుకుంటే తమను తాము మార్చుకోవాలి, భగవంతుని కృపను పొందాలి. సోదరి నివేదిత ఈ సమాజాన్ని సేవించాలనుకునేవారందరికి ఒక స్ఫూర్తి.





