
విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు పరోక్షంగా తమ పేరిట పూజలను జరిపించుకునేందుకు ఆన్‌లైన్ ద్వారా దేవస్థానానికి డబ్బులు చెల్లించారు. పరోక్ష సేవలతో పాటు ప్రత్యేక్ష పూజలకు హాజరు కాని భక్తుల వివరాల ప్రకారం అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం పంపుతుంది. చీర, పంచె, అమ్మవారి చిత్రపటంతో పాటు అమ్మవారి డాలర్, కంకణాలను పోస్టర్ ద్వారా పంపిణీ చేస్తుంది. పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలను పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ముంబైలలో నివాసం ఉంటున్న భక్తులకు ప్రసాదాలను పోస్టల్ ద్వారా అందజేస్తున్నారు.





