News

‘ ఆర్ఎస్ఎస్ అంటే గౌరవం ఏర్పడింది’ : కేరళ ముస్లిం మహిళా అధికారి

255views

కేరళ ప్రభుత్వ అధికారిణి ఆరెస్సెస్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా సంఘ కార్య శతాబ్ది నడుస్తున్న సమయంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. రేష్మీ ఆయిషా… తిరువనంతపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ అధికారిణి. ఆరెస్సెస్ కార్యకర్తలతో, సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తో సమావేశం తర్వాత సంఘ్ పై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని ప్రకటించారు.

మలయాళంలో సోషల్ మీడియాలో ‘‘ఆరెస్సెస్.. ఓ ముస్లిం మహిళగా ఆరెస్సెస్ వందేళ్లకు చేరుకున్న సందర్భంగా తెలుసుకున్న విషయాలు’’ అన్న పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘‘సంఘ్ పై అక్కడా ఇక్కడా వినొస్తున్న పుకార్లు నాకు మొదటి నుంచీ వినిపిస్తూనే వున్నాయి. ఆరెస్సెస్ ముస్లింలను అంతమొందిస్తుంది. వారిని దేశం నుంచి పంపిచేస్తుంది అన్న భయంకర విషయం కూడా తెలిసింది. దీంతో భయం భయంగా ఆరెస్సెస్ ను చూసేదాన్ని. ఓ ధిక్కార ధోరణితో కూడా. కొన్ని రోజుల క్రితం సి. బాబు అనే స్వయంసేవక్ తన స్నేహితుడి చికిత్స కోసం మా ఆస్పత్రికి వచ్చాడు. అప్పుడు తనను పరిచయం చేసుకుంటూ.. నేను ఆరెస్సెస్ కార్యకర్తను. రాష్ట్ర స్థాయిలో బాధ్యతలున్నాయి అంటూ వినయంగా చెప్పారు. వెంటనే ఆరెస్సెస్ అంటే నాకు భయం వుండేది కదా.. ఆయనంటే కూడా భయం ఏర్పడింది. కానీ ఆయన అత్యంత మృదువుగా మాట్లాడారు. కేరళ ధోతీ, చొక్కా, భుజానికి బ్యాగ్ వేసుకొని వచ్చారు. ఇంత సాధారణంగా వచ్చారు. పైగా రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో వున్నానని చెబుతున్నారు. అలాంటి నేతను నేను ఎప్పుడూ చూడలేదు. నేను చాలా ఆశ్చర్యపడ్డా. నేను అనుకుంటున్న ఆరెస్సెస్ కాదు. మా లాంటి ముస్లింలను ఆరెస్సెస్ పాక్ కి పంపిస్తుందా అని నేను అడిగాను. బిగ్గరగా నవ్వారు అతను. లేదు అక్కా… మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు. మీరందరూ కూడా మా సోదరీమణులు అని చెప్పారు.

వచ్చిన ఆరెస్సెస్ కార్యకర్త నా కంటే వయస్సులో పెద్ద. అందుకే పేరు పెట్టి పిలవమన్నాను. అప్పుడు అతను జవాబిస్తూ.. మా సంస్థలో మహిళలను గౌరవించడం నేర్పిస్తారు. అందుకే మహిళలను అక్కా అని సంబోధిస్తాం అని చెప్పారు. దీంతో నాకు మరింత ఆశ్చర్యం, ఆసక్తి వేసింది.

తర్వాత నేను ఆరెస్సెస్ గురించి పరిశోధించడం ప్రారంభించా. ఆరెస్సెస్ లోని అనేక మంది అన్నయ్యలను కలుసుకున్నా. అనేక సంఘ శిక్షావర్గలను సందర్శించా. అందరూ నాతో బాగా మాట్లాడారు.చేతులు జోడించి, అక్కయ్యా అని సంబోధించేవారు. మొదటి సారి తిరువనంతపురం ఆరెస్సెస్ కార్యాలయాన్ని సందర్శించా. నాకు కొంచెం భయం వేసింది. నెమ్మదిగా ఆ భయం పటాపంచలైంది. అక్కడి సోదరులకు సోదరినయ్యా.

వారు ధరించిన ధోతీలు, చొక్కాలు బహుమతులుగా వచ్చినవి. చాలా సందర్భాలలో వారి దగ్గర తినడానికి డబ్బులు, ఆహారం కూడా వుండదు. వారే ఆరెస్సెస్ ప్రచారకులు. వారు మన దేశం కోసం సన్యాసాన్ని స్వీకరించారు. వారికి విలాసవంతమైన జీవితాలు, వాహనాలు లేవు. ఏది దొరికితే అదే తింటారు. బస్ స్టాండ్లలో, రైల్వే కోచ్ లలో నిద్రిస్తారు. దేశ పరమ వైభవం కోసం వారు ప్రాణాలను కూడా త్యాగం చేశారు. మన ప్రధాని మోదీ కూడా వీరిలాగే ప్రచారక్ అని తెలుసుకున్నా.

క్రమ క్రమంగా నేను విభాగ్, ప్రాంత స్థాయి కార్యకర్తలకు అక్కయ్యను అయ్యా. వారిలో ప్రముఖులు పి. పరమేశ్వర్ జీ, సేతు మాధవన్ జీ,పి.పి. ముకుందన్ జీ, ఎస్. సుదర్శన్ జీ, సరసంఘచాలక్ మోహన్ భాగవత్ జీ కూడా. ఆరెస్సెస్ అంటే ఏమిటో వారి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా. నేర్చుకున్నా. వీరందరికీ గత పదేళ్లుగా సోదరిని. బుర్ఖా ధరించకుండానే వారితో ముచ్చటిస్తా. సంఘ్ కార్యకర్తల ప్రవర్తన అసౌకర్యంగా నాకు అస్సలు అనిపించనేలేదు.

ఆరెస్సెస్ అనేది సభ్యత్వం లేని ఓ ఎన్జీవో. ఎవరైనా సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా తీసుకోవచ్చు. ప్రపంచంలోనే ఏకైక సంస్థ ఇది. దేశ పరమ వైభవమే ఆరెస్సెస్ లక్ష్యం. వారిని ఎవరైనా సంప్రదించవచ్చు. సంఘ్ పై భయం లేకుండా అధ్యయనం చేయవచ్చు. వారిని నిందించే వారు వారి దగ్గరికి వెళ్లి, వారు ఏమిటో అర్థం చేసుకోవాలి. అప్పుడు విమర్శకులు సైతం వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరెస్సెస్ కి, మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన లక్షలాది మంది స్వయంసేవకులకు నా శుభాకాంక్షలు. నమస్తే సదా వత్సలే మాతృభూమే’’ అంటూ రేష్మీ ఆయిషా రాసుకొచ్చారు.