
జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఈరోడ్ జిల్లాలోని నాగమలై కొండను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది.
జీవ వైవిధ్య చట్టం 2002 సెక్షన్ 37(1) ప్రకారం అరిడాపట్టిని 2022 నవంబర్‌లో జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. 2024 మార్చిలో కాచంపట్టిని, అదే యేడాది సెప్టెంబర్‌లో ఏలత్తూరు చెరువును జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది.
ఈ క్రమంలో ఈరోడ్ జిల్లాలో 32.22 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన నాగమలై కొండను నాలుగో జీవవైవిధ్య వారసత్వ ప్రాంతంగా ప్రకటించింది. అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన జంతువులను, పశుపక్ష్యాదులను సంరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిరక్షణ నిధిని ఏర్పాటు చేసింది. నాగమలై కొండను నాలుగో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం రాష్ట్ర జీవవైవిధ్య పరిరక్షణ ప్రయాణంలో మరో మైలు రాయి అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.





