ArticlesNews

ఆధ్యాత్మిక, ఆరోగ్యాల అట్లతద్దె

202views

( ఆశ్వయుజ బహుళ తదియ – అట్లతద్దె )

ఆశ్వయుజమాసంలో బహుళ తదియ అట్లతద్దె. ఈ రోజున చంద్రోదయ గౌరీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. దీన్నే అట్లతద్దె వ్రతం అంటారు. వివాహితలు సంసార సౌభాగ్యం, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, పెళ్లి కాని యువతులు సదాచారసంపన్నుడు భర్తగా రావాలని కోరుకుంటూ ఈ వ్రతం చేసుకుంటారు. ఈ రోజు చంద్రోదయం తర్వాత ఉమాదేవిని పూజించి, ఆహారం తీసుకుంటారు.

పౌరాణిక కథను అనుసరించి.. నారదమహర్షి సూచన మేరకు గౌరీదేవి అట్లతద్దె వ్రతం ఆచరించి శివుణ్ణి భర్తగా పొందింది. విస్తృత ప్రచారంలో ఉన్న కథ ప్రకారం.. పాటలీపుత్ర రాజు సుశీలునికి సునామ అనే కూతురు ఉండేది. ఆమెకు వివాహం చేయాలని ఎంత ప్రయత్నించినా మంచి వరుడు దొరకలేదు. సునామ విరక్తి చెంది ఆత్మహత్యకు పూనుకుంది. ఆ దారిన వెళ్తున్న ముని చంద్రోదయగౌరీ వ్రతం గురించి చెప్పగా.. ఆమె భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కానీ ఉపవాసం అలవాటులేని ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ గమనించిన సోదరులు అంతఃపురానికి చేరువలో ఉన్న చింతచెట్టుకు అద్దాన్ని వేళ్లాడదీశారు. దానికెదురుగా అగ్నిని రగిలించి.. ఆ మంటను అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. అలా సోదరికి వెలుగును చూపి, చంద్రోదయమైందని నమ్మించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.

సునామకు సరైన వరుడు లభించకపోవడంతో తల్లిదండ్రులు విసుగుచెంది ఒక వృద్ధుణ్ణి పెళ్లికొడుకుగా నిర్ణయించారు. అతడితో పెళ్లి ఇష్టపడని సునామ ఇల్లు విడిచి అడవికి వెళ్లి ఆత్మహత్యకు సిద్ధపడింది. భూలోక సంచారానికి వచ్చిన గౌరీ శంకరులు సునామను చూశారు. ఆమె చెప్పింది విని.. సోదరుల వల్ల వ్రతలోపం జరిగినందున నియమానుసారం మరోసారి వ్రతం ఆచరించమని చెప్పి ఇంటికి పంపారు. మరుసటి ఏడాది నిష్ఠగా వ్రతం ఆచరించిన సునామకు అనతి కాలంలోనే కరవీరుడు అనే శివభక్తునితో వివాహమైంది. ఇక జీవితాంతం ఆమె ఆ వ్రతం ఆచరించింది.

ఈ వ్రతాచరణలో అనేక ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. ఈ సందర్భంగా కాళ్లూచేతులకు ఔషధప్రాయమైన గోరింటాకు పెట్టుకోవడం ఆచారం. దాని వల్ల ఒంటికి చలవ చేస్తుంది, కాళ్ల పగుళ్ల నుంచి రక్షణ కలుగుతుంది. లంఖణం పరమ ఔషధం అన్నది ఆయుర్వేద సూత్రం. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. ఊయల ఊగటం, ఆడిపాడటం వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం చేకూరతాయి. జ్యోతిష శాస్త్రపరంగా పరిశీలిస్తే అట్లకోసం ఉపయోగించే బియ్యప్పిండి, మినుములు చంద్రుడికి, రాహువుకి ప్రీతికరమైనవి. వీటితో చేసిన అట్లను వాయన దానం ఇవ్వటం వల్ల గర్భదోషాలు తొలగుతాయని విశ్వసిస్తారు. అలాగే కుజునికి ప్రీతికరమైన అట్లను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల కుజదోషాలు తొలగుతాయి. ఇలా ఆధ్యాత్మిక, ఆరోగ్య అంశాలు మిళితమైన చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించటం ఆరోగ్యదాయకమని పెద్దలు హితవు చెబుతారు.