
ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.లక్షన్నర విలువైన నాణేలతో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 18 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని లఖ్‌నవూలోని ఓ షాపింగ్ మాల్‌లో ఏర్పాటు చేశారు. దీనిని యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆవిష్కరించారు. 1, 5, 10 రూపాయల నాణేలతో తయారు చేసిన ఈ విగ్రహం ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించడం విశేషం.
‘‘సంస్కృతి, ఆధ్యాత్మికతకు మనదేశం ఎంతో ప్రసిద్ధి. శ్రీరాముడు మనందరికీ ఆరాధ్యదైవం. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తున్నా’’ అని పాఠక్ పేర్కొన్నారు. లఖ్‌నవూ, గోరఖ్‌పుర్, కోల్‌కతాకు చెందిన 25 మంది శిల్పులు, 20 రోజులకుపైగా శ్రమించి ఈ విగ్రహం తయారు చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.





