
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ గత వంద సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ఒడిశా కాంగ్రెస్ నేత మెచ్చుకుంటూ మాట్లాడారు. గత శతాబ్ద కాలంగా సంఘ్ హిందుత్వాన్ని రక్షించడానికి, వ్యక్తి నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఒడిశా అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత కిషోర్ పటేల్ అన్నారు. సుందర్ గఢ్ లోని భవానీ భవన్ స్టేడియంలో జరిగిన ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ లో క్రమశిక్షణ, అంకిత భావం, దేశభక్తి మెండుగా వుంటుందని ప్రశంసించారు.సంఘ్ ఓ క్రమశిక్షణ కలిగిన సంస్థ అని, వంద సంవత్సరాలుగా అది వ్యక్తి నిర్మాణంలో, హిందుత్వాన్ని పరిరక్షించడంలో నిమగ్నమై వుందన్నారు. సంఘ్ కార్యకర్తలు, ప్రచారకులు హిందుత్వ విలువలను రక్షించడానికి, ప్రచారం చేయడానికి నిరంతరం త్యాగాలు చేశారని, ప్రతి కార్యకర్తలో లోతుగా పాతుకుపోయిన దేశభక్తి స్ఫూర్తి నిజంగా ప్రశంసనీయం అని ప్రకటించారు. అలాగే హిందూ ధర్మం విస్తరణకు, పరిరక్షణకు ఏది అవసరమైనా అది సంఘ్ చేస్తోందన్నారు.
ఇక.. సంఘ వందేళ్ల ప్రయాణాన్ని స్పృశిస్తూ, ప్రసంగించారు. సంఘ వ్యవస్థాపకులు డాక్టర్జీ హిందుత్వ ద్వారానే సమాజాన్ని ఏకం చేయగలం అన్న దానిని లక్ష్యంగా పెట్టుకున్నారని, భారత్ కి స్వాతంత్రం రాక ముందే, వివిధ మార్గాల ద్వారా సమాజాన్ని ఏకం చేయడంలో సంఘ్ పాత్ర చాలా వుందన్నారు.
‘‘క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించే దిశగా సంఘ్ కదులుతోంది. అలాగే బలమైన, స్వావలంబన దేశాన్ని తయారు చేయాలన్న దిశగా కూడా కదులుతోంది. ఈ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది. సమరసత, క్రమశిక్షణ, దేశభక్తి అనే లక్షణాలు నేటి కాలానికి అత్యంత అవసరం’’ అని మాజీ స్పీకర్ తెలిపారు.
ఆరెస్సెస్ ఏ ఒక్కరిదో కాదని, ఇది హిందువులందరిదీ అని ప్రకటించారు. జాతీయ సమైక్యతకి, శాంతి, దేశభక్తి అనేవి అవసరమని, ప్రతి ఒక్కరూ ఆరెస్సెస్ లో చేరవచ్చని, సంఘ్ భవిష్యత్తు మరింత ఉజ్జ్వలంగా వుంటుందని, దేశ నిర్మాణంలో మరింత కీలకంగా మారుతుందని కిషోర్ పటేల్ ప్రకటించారు.





