
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన శ్రీశైలంలో జ్యోతిర్లింగం, భ్రమరాంబ శక్తిపీఠాన్ని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జరిగే “జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్” సభలో పాల్గొననున్నారని తెలిపారు.ప్రధానమంత్రి సభకు వచ్చే వారి కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని… ఆహారం, తాగునీరు వంటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం తెచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతించి దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది.





