News

ఖలిస్థానీ నెట్‌వర్క్‌కు నిధులపై కెనడా నిఘా..

125views

ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల నెట్‌వర్క్‌కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా వేశాయి. ఆ దేశంలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకొంది. ఆ దేశ ఆర్థిక శాఖకు చెందిన మోర్సో నివేదిక.. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని హమాస్‌, హెజ్‌బొల్లాతో పోల్చింది. వేర్పాటువాదులు సేవా సంస్థల నిధులను ఉగ్ర కార్యకలాపాలకు వాడుతున్నారని ఆరోపించింది.

స్థానిక రేడియో స్టేషన్‌ అధిపతి మణీందర్‌ ఆ దేశ ప్రధాని మార్క్‌ కార్నీ సహా పలువురు నాయకులకు కొన్నాళ్ల క్రితం లేఖ రాశారు. సామాజిక సేవకు వచ్చే విరాళాల దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. గత పాలకులు దీనిపై చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని వెల్లడించారు. కెనడాలోని నాన్‌ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌లో ఉగ్ర స్లీపర్‌ సెల్స్‌ ఉంటున్నాయనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ ఉగ్ర సంస్థ సభ్యుడు తల్వీందర్‌ సింగ్‌ పర్మర్‌ కుమారుడు నురిందర్‌ సింగ్‌ పర్మర్‌ కేసు ఈ కోవలోనే పరిశీలిస్తున్నారు. నురిందర్‌ కెనడాలోని నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలోనే పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అతడు తన పూర్తి పేరును వెల్లడించలేదని తేలింది. ఇతడికి కూడా బబ్బర్‌ ఖల్సాతో సంబంధాలున్నాయి.

ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఛారిటబుల్‌ సంస్థలకు వచ్చే నిధుల దుర్వినియోగంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు భారత్‌-కెనడా భద్రతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాయి. ఈ క్రమంలోనే కెనడా లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది.
ఖలిస్థాన్‌ వేర్పాటువాద సంస్థలకు తమ దేశంలోనే నిధులు అందుతున్నాయని ఇటీవల కెనడా తొలిసారిగా అంగీకరించింది. ‘‘అసెస్‌మెంట్‌ ఆఫ్‌ మనీలాండరింగ్, టెర్రరిస్ట్‌ ఫైనాన్సింగ్‌ రిస్క్స్‌ ఇన్‌ కెనడా 2025’’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇంటర్నేషనల్‌ సిక్‌ యూత్‌ ఫెడరేషన్, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ వంటి ఖలిస్థాన్‌ వేర్పాటువాదులతో పాటు, హమాస్, హెజ్‌బొల్లాలు కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందుతున్నాయని వెల్లడించింది.