
ఐటీఐలు ఆత్మ నిర్భర్ భారత్‌కు వర్క్‌షాప్‌లని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడానికి రూ.60 వేల కోట్లతో పీఎం సేతు (ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐస్) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు 400 నవోదయ, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,200 వృత్తి విద్య నైపుణ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసే పథకానికీ శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. శనివారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా జరిగిన ‘కౌశల్ దీక్షంత్ సమారోహ్’ కార్యక్రమంలో పాల్గొని దేశం నలుమూలల నుంచి వచ్చిన ఐటీఐ విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐటీఐల్లోని వివిధ ట్రేడ్లలో జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచిన 46 మందికి అవార్డులు అందజేసి సత్కరించారు. ఇందులో ఏపీ నుంచి ముగ్గురు పి.మధులత(రిఫ్రిజిరేషన్, ఎయిర్‌కండీషన్ టెక్నీషియన్), యామినీ వరలక్ష్మి(ఉడ్‌వర్క్ టెక్నీషియన్), వందన(పెయింటర్), తెలంగాణ నుంచి తాళ్లూరి పల్లవి(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అసిస్టెన్స్) ఒకరు కలిపి మొత్తం నలుగురు తెలుగమ్మాయిలు ప్రధాని చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
నైపుణ్యవంతులకు జన జీవితంలో గౌరవం లభించకపోతే ఆత్మన్యూనతకు లోనవుతారు. ఈ భావనను మార్చాలంటే శ్రమయేవ జయతే అనడమే కాకుండా శ్రమయేవ పూజ్యతే అని చెప్పాలి. అందుకే దేశవ్యాప్తంగా ఐటీఐల్లో చదువుకునే వారిలో విశ్వాసం నింపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. పీఎం సేతు పథకం ద్వారా ఐటీఐలు ఇప్పుడు పరిశ్రమలతో మరింత బలంగా అనుసంధానమవుతాయి. ఈ ఏడాది 10 లక్షల మందికిపైగా విద్యార్థులు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్టులో పాల్గొన్నారు. అందులో విజయం సాధించిన 46 మందికి ఇక్కడ సన్మానం చేశాం. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ వాసులే’ అని ప్రధాని పేర్కొన్నారు.
‘జన నాయక్’ బిరుదునూ వదలడం లేదు
బిహార్‌ను గతంలో పాలించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రభుత్వం అక్కడి విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఈ కారణంగానే అక్కడి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారని ధ్వజమెత్తారు. నీతీశ్ కుమార్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగయ్యాయని స్పష్టం చేశారు. విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని ఇటీవల ‘జన నాయక్’ అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొనడంపై ప్రధాని స్పందించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ను ప్రజలు ‘జన నాయక్’ బిరుదుతో సత్కరించారని, ఆ హోదాను కొందరు దొంగిలించాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు.
________________________________________
‘పీఎం సేతు పథకం కింద వెయ్యి ఐటీఐలకు ఆధునిక యంత్రాలను అందజేస్తాం. పరిశ్రమల నిపుణులు వచ్చి విద్యార్థులకు బోధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య డిమాండుకు తగ్గట్లు మన యువతను ఈ పథకంలో తీర్చిదిద్దుతాం. ఇప్పటికే రూ.లక్ష కోట్లతో ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనతో 3.50 కోట్ల మంది యువత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందడానికి మార్గం సుగమమైంది.
-ప్రధాని మోదీ
________________________________________
సంతోషంగా ఉంది.. బాధ్యతను పెంచింది: తాళ్లూరి పల్లవి
నిబద్ధత, కఠిన శ్రమ కారణంగానే ఈ విజయం దక్కిందని తాళ్లూరి పల్లవి చెప్పారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని.. అదే సమయంలో ఈ పురస్కారం బాధ్యతను పెంచిందని ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ తెలిపారు. తాళ్లూరి పల్లవి ఖమ్మం పరిధిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ పూర్తిచేశారు. పీఎంసేతులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశం పొంది ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఏఐలో శిక్షణ పొందారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను చూపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్‌గా నిలిచి ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పల్లవి తండ్రి రవి ప్రైవేటు ఎలక్ట్రీషియన్. తల్లి అజిత గృహిణి. ప్రధానమంత్రి చేతుల మీదుగా తమ కూతురు అవార్డు అందుకోవడం గర్వకారణమని.. చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. పల్లవిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు.





