News

ప్రధాని మోదీకి భూటాన్‌ రాజు అరుదైన గౌరవం.. 76వ బౌద్ధ స్తూపం అంకితం

20views

న్యూఢిల్లీ: భారత్‌-భూటాన్‌ మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నామ్‌గ్యాల్‌ వాంగ్‌చుక్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవాన్ని అందించారు. మోదీ పట్ల గౌరవాభిమానాలకు ప్రతీకగా ఓ పవిత్ర బౌద్ధ స్తూపాన్ని ఆయనకు అంకితం చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు.

ఈ నెల ఒకటో తేదీన భూటాన్‌ ఒక చారిత్రక ఘనత సాధించిందని రిజిజు తెలిపారు. కేవలం ఆరు గంటల వ్యవధిలో 108 బౌద్ధ స్తూపాలను నిర్మించడం విశేషమని పేర్కొన్నారు. 40 వేల మందికి పైగా వాలంటీర్లు, బౌద్ధ సన్యాసులు, కళాకారులు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములయ్యారని వెల్లడించారు. అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన నిర్మాణ పనులు అసాధారణ వేగంతో తెల్లవారేసరికి పూర్తయ్యాయని వివరించారు.

ఈ 108 స్తూపాల్లో పవిత్రమైన 76వ స్తూపాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేయడం భారత్‌కు లభించిన గొప్ప గౌరవమని కిరణ్‌ రిజిజు అభివర్ణించారు. భారత్‌-భూటాన్‌ దేశాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి, సాంస్కృతిక సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

బౌద్ధ సంప్రదాయంలో స్తూపం అంటే కేవలం ఓ స్మారక చిహ్నం మాత్రమే కాదని, జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధుని మనస్సుకు భౌతిక రూపంగా భావిస్తారని రిజిజు వివరించారు. ఇంతటి పవిత్రమైన, చారిత్రక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.