News

సోషల్ మీడియాలో ట్రెండింగ్ 19 ఏళ్ల యువ ఆధ్యాత్మిక ప్రవచనకర్త

39views

ఆధ్యాత్మిక ప్రవచనాలంటే సాధారణంగా వయసు పైబడినవారే గుర్తుకొస్తారు. సంప్రదాయ వస్త్రధారణ, గంభీరమైన రూపంతో కనిపించే ఆధ్యాత్మిక గురువులకు భిన్నంగా ఓ 19 ఏళ్ల యువ ప్రవచనకర్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తన ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు విభిన్నమైన హెయిర్‌స్టైల్‌, క్లీన్‌షేవ్‌ లుక్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన శ్రీ శాశ్వత్ ఆచార్య ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. నెటిజన్లు ఆయనను ‘జెన్‌ జెడ్‌ బాబా’, ‘పూకీ బాబా’ అంటూ పిలుస్తున్నారు.

శ్రీ స్వామి శాశ్వతాచార్య జీ మహారాజ్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన బృందావన్‌లోని శ్రీధామ్ గోదా విహార్ మందిరానికి పీఠాధీశ్వరుడిగా వ్యవహరిస్తున్నారు. భాగవత కథా ప్రవచనాలు చేస్తూ ఆధ్యాత్మిక విషయాలను ప్రజలకు వివరిస్తున్నారు. భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక జీవన విధానాలకు సంబంధించిన ఆయన ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఆయన ప్రసంగాలకంటే ఎక్కువగా వయసు, కర్లీ హెయిర్‌, ఆధునిక రూపమే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి వేదికల్లో ఆయనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ మీమ్స్‌ రూపొందిస్తున్నారు. సంప్రదాయ ఆధ్యాత్మిక రంగంలో యువతరం ప్రతినిధిగా కనిపిస్తున్నారంటూ కొందరు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘జెన్‌ జెడ్‌ బాబా’ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో మరో ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు కూడా సోషల్ మీడియాలో ‘పూకీ బాబా’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు శాశ్వత్ ఆచార్యకు కూడా అదే ముద్దుపేరు వినిపిస్తుండటం నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది.

మొత్తానికి సంప్రదాయ ఆధ్యాత్మిక ప్రవచనాలకు ఆధునిక తరం రూపాన్ని జోడిస్తూ 19 ఏళ్ల శాశ్వత్ ఆచార్య సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. ఆయన ప్రసంగాలు, వ్యక్తిత్వం, విభిన్నమైన అలంకరణ ప్రస్తుతం నెట్టింట చర్చకు కేంద్రంగా మారాయి.