News

‘స్వీట్ కార్న్’తో బెల్లం తయారీ- రైతు విన్నూత ప్రయోగం- దేశంలోనే తొలిసారిగా

221views

సాధారణంగా మొక్కజొన్న కాడలను పశువుల మేతకోసం అమ్ముతారు. కానీ రైతులకు దీనివల్ల ఎక్కువ లాభం ఉండేది కాదు. అయితే ఇటీవల అభివృద్ధి చేసిన స్వీట్ కార్న్ కాడలు అధిక తీపి శాతం కలిగి ఉంటాయి. ఆ విషయాన్ని గమినించిన బాగల్కోట్ జిల్లాలోని సంగనట్టి గ్రామానికి చెందిన మహాలింగప్ప అనే రైతు విన్నూత ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. చెరకు నుంచి బెల్లం తయారీ పద్ధతి గురించి తెలుసుకున్నారు. అదే పద్ధతిలో మొక్కజొన్న కాడల్లో ఉండే రసంతో బెల్లం తయారు చేసేందుకు ప్రయత్నించారు. చివరిగా విజయం సాధించారు. మొక్కజొన్న కాడలతో తయారు చేసిన బెల్లాన్ని ప్రయోగశాలలో పరీక్షించారు. అది చెరకు బెల్లంకంటే మెరుగ్గా ఉందని నిర్ధారించారు. దీంతో అక్టోబర్ 8న, మహాలింగప్ప ఈ ప్రక్రియను ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ముందు ప్రదర్శించనున్నారు.

రైతులకు ప్రయోజనకరమైన కొత్త పద్ధతి
దేశంలోనే తొలిసారిగా మొక్కజొన్న కాడలతో బెల్లం తయారు చేస్తున్నామని మహాలింగప్ప తెలిపారు. ‘సాధారణంగా బెల్లం చెరకు నుంచి తయారు చేస్తాం. కానీ దేశంలో తొలిసారి మొక్కజొన్న కాడలతో బెల్లం తయారు చేస్తున్నాం. చెరకు పంటకు 12 నెలలు పడుతుంది. కానీ కార్న్ 4 నెలల్లోనే పండుతుంది. ఏడాదిలో రెండు పంటలు పండించవచ్చు. ఇది రైతులకు చాలా లాభదాయకం. ఒక్క ఎకరా నుంచి 10 టన్నుల మొక్కజొన్న కాడలు వస్తాయి. వాటిని ఉపయోగించి మంచి బెల్లం తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను కలిగి ఉంటుంది. ఒక టన్ను చెరకు నుంచి 100-110 కిలోల బెల్లం వస్తుంది. కానీ మొక్కజొన్న కాడల్లో నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల 60-70 కిలోల బెల్లం మాత్రమే వస్తుంది’ అని మహాలింగప్ప చెప్పారు.

‘మధుమేహంతో బాధపడేవారికి మంచిది’
శాస్త్రీయంగా, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయోగపడుతుందని మహాలింగప్ప తెలిపారు. ‘ఇందులో చక్కెర శాతం కొంత తక్కువగా ఉంటుంది. పొటాషియం, మోలిబ్డినం, కార్బోహైడ్రేట్లు, సుక్రోజ్, చక్కెర మోతాదు సాధారణంగా ఉపయోగించే బెల్లం కంటే తక్కువగా ఉంటుంది. ఈ అంశంపై ఇప్పటికే ల్యాబ్ పరీక్ష జరిగింది. ఈ నెల 8న బెల్లాన్ని తయారు చేసి పంపిణీ చేస్తాం అని మహాలింగప్ప తెలిపారు. అన్ని మొక్కజొన్న కాడల నుంచి బెల్లం తయారు చేయొచ్చు. కానీ స్వీట్ కార్న్ మాత్రమే బెల్లం తయారికి అనుకూలం. విత్తనాలు నాటిన 120 రోజులకే కాడలు సిద్ధమవుతాయి. అయితే బెల్లం తయారీ కోసం రసం తీసేందుకు 2-3 గంటల్లోనే కాడలను ప్రాసెస్ చేయాలి. ఆలస్యం అయితే రసం తగ్గిపోతుంది. బెల్లం ఉత్పత్తి కూడా తగ్గుతుంది’ అని మహాలింగప్ప తెలిపారు.

మొక్కజొన్న పండించే ప్రాంతాల దగ్గరే బెల్లం తయారీ మిల్లులు ఉంటేనే లాభదాయకంగా ఉంటుందని మహాలింగప్ప తెలిపారు. ‘ఉత్తర కర్ణాటకలో ధార్వాడా, కొప్పల్, గదగ్, హవేరి జిల్లాల్లో కార్న్ విస్తారంగా పండిస్తున్నారు. రైతులు అక్కడే చిన్న మిల్లులు ఏర్పాటు చేస్తే తేమ నిల్వగా ఉండి బెల్లం తయారీ సులభమవుతుంది. ప్రభుత్వం సగం సబ్సిడీతో రుణాలు ఇస్తోంది. దీంతో రూ.10–15 లక్షల వ్యయంతో మిల్లులు ఏర్పాటు చేయవచ్చు. అక్టోబర్ 8న మా 10 ఎకరాల మొక్కజొన్న పొలంలో బెల్లం తయారీ ప్రదర్శన చేస్తాం. దీర్ఘకాలిక నిల్వ, ప్యాకింగ్, విక్రయం, ధర నిర్ణయం వంటి అంశాలపై నిపుణుల సలహా తీసుకుంటాం’ అని ఆయన తెలిపారు.