ArticlesNews

ఆవు పేడతో అందమైన కళాకృతులు- 500 మందికి పైగా మహిళలకు ఉపాధి

28views

దీపావళి వచ్చిందంటే ఇళ్లన్నీ దీపాల కాంతులతో వెలిగిపోతాయి. ఈ పండుగ వేళ ఇంటిని అందంగా అలంకరించేందుకు ప్రజలు రకరకాల ప్రమిదలు, దీపాలు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ సీజనల్ డిమాండ్‌ను ఝార్ఖండ్​లోని ఇద్దరు స్నేహితులు గుర్తించారు. దాంతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించి, గ్రామీణ మహిళలు ఉపాధి కల్పిస్తున్నారు. ఆవు పేడ, మట్టి మిశ్రమంతో అందమైన దీపాలు, లక్ష్మీ-గణేశ విగ్రహాలు, ఇతర గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తూ వారు సొంతంగా ఆదాయం సంపాదించుకునే చస్తున్నారు. దాంతో ఆ మహిళలు ఇంటి నుంచే పని చేసుకుంటూ కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు పిల్లల చదువులకు కూడా తోడ్పడుతున్నారు.

ఓ చిన్న ఆలోచనతో పెద్ద స్టార్టప్‌గా
రాంచీ జిల్లాలోని కిశోహోర్‌గంజ్‌కు చెందిన సోనాలి, రోషన్ ఇద్దరు స్నేహితులు. రోషన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తన బంధువుతో కలిసి ఓ వ్యాపారం చేసేవారు. అదే సమయంలో ప్లస్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సోనాలి ఓ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో రోషన్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న ఓ సమస్య వారి దృష్టికి వచ్చింది. ఆవులు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాటి పోషణ యజమానులకు ఆర్థిక భారంగా మారుతోందని గమనించారు. అలగే ఆవు పేడను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని వారు గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆవు పేడతో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న గృహోపయోగ, అలంకరణ వస్తువులను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో కొత్త డిజైన్లను రూపొందిస్తూ ప్రయోగాలు ప్రారంభించారు. క్రమంగా వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. అలా కోవిడ్ మహమ్మారి సమయంలో ‘గోవర్ క్రాఫ్ట్’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు.

కుటుంబానికి అండగా
ఈ స్టార్టప్‌ను సోనాలి, రేషన్​లు తొలుత ఐదుగురు మహిళలతో ప్రారంభించారు. ఆ మహిళలకు ఝార్ఖండ్ స్టేట్ లైవ్లీహుడ్ ప్రమోషన్ సొసైటీ (జేఎస్ఎల్పీఎస్) ద్వారా శిక్షణ ఇప్పించారు. శిక్షణ పొందిన మహిళలు తాము నేర్చుకున్న పనిని ఇతరులకు నేర్పించారు. ఇలా ప్రస్తుతం ఈ స్టార్టప్ ద్వారా 500 మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీగా ఉండే మహిళలు తమ సమయాన్ని ఈ పనికి కేటాయిస్తున్నారు. ఈ స్టార్టప్‌లో పనిచేస్తున్న మహిళలకు గతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేదని అందులో పని చేస్తున్న ఓ మహిళ చెప్పారు. పిల్లల చదువులు, రోజువారీ ఖర్చులను తీర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారని అన్నారు. అయితే ఇప్పుడు ఇంటి నుంచే పని చేస్తూ కొంత ఆదాయం సంపాదిస్తున్నారని, దీంతో కుటుంబ ఖర్చులకు తోడ్పడటంతో పాటు పిల్లల విద్యకు కూడా తమ వంతు సహాయం అందించగలుగుతున్నారని ఆమె చెప్పారు.

ఎలా తయారు చేస్తారు?
ఈ ఉత్పత్తుల తయారీకి, ముందుగా ఆవు పేడను కొంత మట్టితో కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. అనంతరం ఈ మిశ్రమాన్ని వివిధ రకాల అచ్చుల్లో పోసి కావాల్సిన ఆకృతుల్లో మలుస్తారు. వాటిని బాగా ఎండబెట్టి, అవసరమైన మెరుగులు దిద్దుతారు. చివరగా ఆకర్షణీయమైన రంగులతో అలంకరిస్తారు. ఈ విధంగా డిజైనర్ దీపాలు, లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలు, అలంకరణ దండలు, ఇతర గృహాలంకరణ వస్తువులు కలిపి మొత్తం 41 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.

పశువుల యజమానులకూ ఆదాయం
ఈ స్టార్టప్ ద్వారా గ్రామీణ మహిళలతో పాటు పశువుల యజమానులకు కూడా ఆదాయం లభిస్తోందని వారు తెలిపారు. కిలో పేడకు సుమారు రూ.10 చెల్లిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా పాలు ఇవ్వడం ఆపేసిన ఆవులను పోషిస్తున్న యజమానులకు ఇది అదనపు ఆదాయ వనరుగా మారుతోందని అన్నారు. అయితే ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు వాటికి కొనుగోలుదారులను గుర్తించడం కూడా వ్యాపారంలో ముఖ్యమైన అంశమని రోషన్ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా విక్రయాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధాన జాతరలు, ప్రదర్శనల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేస్తున్నారని అన్నారు. అక్కడ వినియోగదారులు వస్తువులను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారని చెప్పరు.