News

భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం – బిపిన్ రావత్

604views

కొత్త త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక గౌరవ వందనం స్వీకరించారు. సైనిక దళాల్లో రాజకీయజోక్యం పెరిగిపోతోందన్న ఆరోపణలపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము అధికారంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేస్తామని కానీ రాజకీయాలకు దూరంగా ఉంటామని వివరించారు. అలాగే సీడీఎస్‌ విధులపైనా స్పష్టతనిచ్చారు. ”సీడీఎస్‌కి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. మూడు దళాలు సమన్వయంతో పనిచేసేలా చూడాలి. మేమంతా ఒక బృందంగా పనిచేస్తాం. మూడు దళాలు విడివిడిగా సాధించే ఫలితాల కంటే కలిసి పనిచేస్తే వచ్చే ఫలితం మరింత మెరుగ్గా ఉండాలి. దాన్ని సాధించేందుకు సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది” అని రావత్‌ వివరించారు. వనరుల్ని సద్వినియోగపరచుకోవడం, సంయుక్త శిక్షణపైనా సీడీఎస్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల వెంబడి ఉత్పన్నమయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత సైన్యం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని మంగళవారం జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. మంగళవారం ఆయన సైన్యాధిపతిగా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా సైన్యం ఆయనకు గౌరవ వందనం సమర్పించింది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరజవాన్లకు ఆయన నివాళులర్పించి మాట్లాడారు. రక్షణశాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన సైనిక వ్యవహారాల విభాగానికీ రావత్‌ నాయకత్వం వహిస్తారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.