ArticlesNews

కాలం దైవస్వరూపం

2.1kviews

గలు-రాత్రి ;

రోజులు-వారాలు ;

నెలలు-సంవత్సరాలు ;

యుగాలు-కల్పాలు;

బ్రహ్మ కల్పాలు . . . ఇలా ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు దొర్లిపోయాయో ?

కాలానికి సూర్య చంద్రులు ఆధారం . సూర్యుడు చంద్రుడు విష్ణువు రెండు కళ్లు అంటుంది విష్ణు సహస్రనామం. కాబట్టి కాలం విరాట్ పురుషుడి చూపు – అంతే.

కృత, త్రేతా, ద్వాపర, కలియుగం అన్నది వేదం చేసిన విభజన. ఇందులో దివ్య సంవత్సరాలు అంటే మన మామూలు 365 రోజుల లెక్క కాదు. అందుకే రాముడు 11 వేల సంవత్సరాలు పాలించాడు, లవ కుశులు 6 వేల సంవత్సరాలు పాలించారు, విశ్వామిత్రుడు 10 వేల సంవత్సరాల చొప్పున 3 సార్లు తపస్సు చేస్తేకానీ బ్రహ్మర్షి కాలేదు అంటే మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. భూమి మీద కాలం ఒకలా ఉంటే, భూమి ఉపరితలం మీద పైపైకి, లేదా అంతరిక్షంలోకి వెళ్లేకొద్దీ కాల ప్రమాణాలు మరోలా ఉంటాయి. కాంతివేగంకంటే ఇంకా వేగంతో రోదసిలో ప్రయాణిస్తే అసలు కాలమే కదలని స్థితి ఒకటి ఉంటుంది. ఇదంతా అంతరిక్ష శాస్త్ర కాలం- దూరం- వేగం లెక్కలతో తేల్చుకోవాల్సిన విషయం.

కాలోహి బలవాన్ కర్తా – అన్నాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలమే అన్నిటికంటే బలమయినదట. కానికాలం, పాడుకాలం, మంచి కాలం అని మన స్థితినిబట్టి కాలాన్ని తిడుతూ, పొగుడుతూ ఉంటాం. లేకపోతే దేనికయినా కాలం కలిసిరావాలి అని సర్దిచెప్పుకుంటాం. రోజులు మారాయి అంటాం. ఆ రోజులే బాగుండేవి అని గతము తలచి వగచేకన్నా సౌఖ్యం లేదనుకుంటాం. మంచి, చెడుల రోజులను తలచుకుని తలచుకుని పండగలుగానో, స్మృతిగానో జరుపుకుంటూ ఉంటాం.

మానవ పరిణామాన్ని బట్టి గడిచిన కాలాన్ని యుగాలుగా చరిత్రకారులు ఒక విభజన చేస్తారు. పాత రాతి యుగం , లోహ యుగం , ఆధునికం అని.

క్రీస్తు పుట్టాక , పుట్టక ముందు అని ఇంకో విభజన . శాలివాహన శకంతో మనదొక విభజన . అయితే ఇవేవీ పరిపూర్ణం కాదు . కొండ గుర్తుగా ఏదో ఒక విభజనగా పనికొస్తాయే గానీ , ఎన్ని సృష్టి జరిగాయో , ఎన్ని బ్రహ్మ ప్రళయాల్లో సర్వం లయమయ్యిందో లెక్కలు వేస్తే – ఇపుడున్న బ్రహ్మ వైవస్వత మన్వంతరానికి ముందు ఎన్ని మన్వంతరాలు కాలగర్భంలో కలిసిపోయాయో లెక్కకడితే సున్నాలు చాలవు . ఎందరు బ్రహ్మలు మారారో శివుడి మెడలో ఉన్న బ్రహ్మ కాపాలాలను గమనిస్తే కానీ ఖచ్చితమయిన లెక్క తేలదు. ఒకవేళ తేల్చాలన్నా అంత త్వరగా తేలేది కాదు.

ఈరోజుకు ఈరోజు వర్తమానం.

నిన్న గతం.

రేపు భవిష్యత్తు. కాలమెప్పుడూ మౌన సాక్షి.

కాలానికి ఆది లేదు- అంతూ లేదు.

కాలమిప్పిడు మనకు దైవం కాదు-

కాలం మనకు కేవలం తేదీల క్యాలెండర్ .

అయినా నలుగురితో నారాయణ.

అంటే నారాయణ- చైతన్య కాదు.

సామెత నారాయణ.

ఇంగ్లీషు కొత్త సంవత్సరం 2020 శుభాకాంక్షలతో –

రచన – పమిడికాల్వ మధుసూదన్

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.