
సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్-జెడ్ ఉద్యమం.. అవినీతి ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినప్పటికీ నిరసనలు ఆగకపోవడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించాలని మంగళవారం నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో వెనక దర్శనమిచ్చిన హిందూరాజు ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్తరువు ద్వారా ఆయన ఏదైనా సందేశం ఇవ్వాలని ప్రయత్నించారా..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి .
ఆ కళాఖండంలో కన్పిస్తున్నది 18వ శతాబ్దానికి చెందిన రాజు పృథ్వీ నారాయణ్ షా. ఇది పెద్ద సిగ్నల్, పెద్ద ప్రకటన అంటూ నెటిజన్లు దాని గురించి స్పందిస్తున్నారు. నేపాల్‌ను చివరగా పాలించినది ‘షా’ రాజవంశమే. మావోయిస్టుల తిరుగుబాటుతో 2008లో జ్ఞానేంద్ర షా గద్దె దిగడంతో ఈ హిందూ వంశపాలన ముగిసింది. దాదాపు రెండున్నర శతాబ్దాల పరిపాలన అంతమై.. ప్రజాస్వామ్యానికి బాటలు పడ్డాయి. అయితే ఈ 17 ఏళ్ల కాలంలో దేశంలో 14 సార్లు ప్రభుత్వాలు మారడం గమనార్హం. ఈ రాజకీయ అస్థిరత, ప్రభుత్వాల అవినీతి, బంధుప్రీతిపై ప్రజలు విసుగు చెందారు.
దాంతో రాచరికం పునరాగమనంపై చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఆ చిత్రం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది రాచరికానికి సంకేతమా..? తర్వలో నేపాల్‌కు హిందూ రాజుల పాలన తిరిగి రాబోతుందా..? అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడో విషయాన్ని గమనించాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. నేపాలీస్ ఆర్మీలో నారాయణ్ షాకు ప్రత్యేకస్థానం ఉంది. గోర్ఖా ప్రిన్సిపాలిటీలో జన్మించిన నారాయణ్ షా 20 ఏళ్ల వయసులో అధికారాన్ని చేపట్టారు. ఆధునిక నేపాల్ రూపశిల్పిగా ఆయన పేరు గాంచారు. ఆర్మీకి చెందిన ఎన్నో కార్యక్రమాలు, సంస్థలు, కొన్ని మౌలిక సదుపాయాలు ఆయన పేరు మీదే ఉంటాయి. ఈ సిగ్దెల్ గత ఏడాది ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇలాంటిదే మరో చిత్రం బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించింది. అయితే మళ్లీ ఇది కనిపించడం చర్చకు దారితీసింది.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది మొదట్లో రాచరిక పాలనకు మద్దతుగా నేపాల్‌లో ర్యాలీ జరిగింది. ఆ దేశంలో రాచరికానికి మద్దతు ఇచ్చే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ దానిని నిర్వహించింది. నేపాల్‌లో రాజు పాలనను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఆసందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోను ప్రదర్శించారు. ఆ ర్యాలీలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను ప్రదర్శించడం గమనార్హం. మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇతర దేశ నాయకుల చిత్రాలను ప్రదర్శించినందుకు అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా.. అస్థిరపాలనపై నిరసన వ్యక్తమవుతుండటంతో జ్ఞానేంద్ర తనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దాంతోనే ఈ రాచరిక అనుకూల ఉద్యమం రాజుకుంది.





