News

‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’

210views

ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేళ్లుగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న సిక్కిం.. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’ ప్రోగ్రామ్‌ కింద ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ ‘బ్యాటిల్‌ ఫీల్డ్‌ టూరిజం’ అనే ఆలోచనను పర్యాటకరంగంలో తీసుకువస్తున్న మరో కొత్త అధ్యాయంగా అక్కడి ప్రభుత్వం అభివర్ణించింది. సెప్టెంబర్‌ 27 నుంచి ఈ రెండు పర్యాటక ప్రాంతాలను ప్రారంభిస్తున్నట్లు సిక్కిం పర్యాటక కార్యదర్శి సి.శుభకర్ రావు తెలిపారు.

భారత సైన్యం, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, పోలీసులతో చర్చించిన తర్వాత కేంద్రం ఆమోదంతో ఈ రెండు పర్యాటక కేంద్రాలను తెరవాలని నిర్ణయించుకున్నట్లు పర్యాటక కార్యదర్శి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చో లా, డోక్లాంలలో ఇప్పటికే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి రోజూ రెండు ప్రదేశాల్లో 25 వాహనాలను అనుమతిస్తారన్నారు. దేశ రక్షణకు చారిత్రాత్మక యుద్ధ భూముల్లో మన సైనికులు పడిన కష్టాలు, చేసిన త్యాగాలు, వారి శౌర్యాన్ని పౌరులు స్వయంగా చూసి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘భారత్ రణ్‌భూమి దర్శన్’ కార్యక్రమంలో మొదటిసారి ‘యుద్ధభూమి పర్యాటకం’ అనే భావనను ప్రజల ముందుకుతీసుకువచ్చారు. ఈ జాబితాలో డోక్లాం, నాథు లా, చో లాతో సహా సిక్కింలోని మరో మూడు ప్రదేశాలను చేర్చారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు.
భారత్-చైనా ప్రతిష్టంభన

గ్యాంగ్‌టక్‌కు తూర్పున 68 కి.మీ. దూరంలో ఉన్న డోక్లాం భూటాన్, చైనా, భారత్‌ మధ్య ఉన్న త్రి-సరిహద్దు ప్రాంతం. 2017 జూన్‌లో భూటాన్ తమదని చెప్పుకుంటున్న ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ప్రారంభించడంతో ఈవిషయంలో భారత సైన్యం జోక్యం చేసుకుంది. డోక్లాం హక్కులపై ఇరు దేశాల సైన్యం మధ్య రెండు నెలలకు పైగా ప్రతిష్టంభన నెలకొనడంతో తర్వాత చైనా ఆ నిర్మాణపనులను నిలిపివేసింది. 1967లో, నాథు లా, చో లా ప్రాంతాల సరిహద్దు హక్కుల కోసం భారత్‌-చైనా దళాల మధ్య ఘర్షణ నెలకొంది. నాథు లా ఇప్పటికే ప్రముఖ్య పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది.