
156views
ఉషోదయం అయ్యిందంటే మొదలు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన విద్యాసాగర్, ఉషా దంపతుల ఇంటిపై పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తాయి. అప్పటికే ఆ దంపతులు వాటికి తిండి గింజలు సిద్ధం చేస్తారు. కడుపునిండా తిని, నీళ్లు తాగి చెంగుచెంగున ఎగురుకుంటూ వెళ్తాయి. పిచ్చుకల కోసం ఇంటి చుట్టూ వరి కంకులు కట్టి ఉంచుతారు. వాటిని పిచ్చుకలతో పాటు ఉడుతలూ తింటాయి. కొన్ని పక్షులైతే ఆ ఇంటి ఆవరణలోనే గూళ్లు కట్టుకున్నాయి. కోతులు, కుక్కల కోసం బ్రెడ్లు ఇతర ఆహార పదార్థాలను తెచ్చి వేస్తుంటారు. ఈ లోకం సకల ప్రాణులది.. అన్నింటికీ బతికే హక్కు ఉందన్న భావనతో వాటికి ఆహారం అందిస్తున్నామని విద్యాసాగర్ చెబుతున్నారు.





