ArticlesNews

గో.. వేదన!

208views

గోదావరి జిల్లా అంటే.. మూగ జీవాలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు.. అటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం గోవులను చూస్తుంటే గోమాతకు ఇంతటి దుస్థితా అనేలా పరిస్థితి మారింది.. ఇటీవల దివాన్‌చెరువు జాతీయ రహదారిపై జరిగిన వరుస ప్రమాదాల్లో మూడు గోవులు మృత్యువాతపడ్డాయి. ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో ఒక గోవు మృతిచెందింది. అయినా కనీసం చర్యలు లేవు. నేటికీ గోవులు రోడ్లపైనే తిరుగుతున్నాయి. సాంస్కృతిక రాజధానిగా పేరు గాంచిన రాజమహేంద్రవరంలో రోడ్లపై ఆక లికి అలమటిస్తూ సంచరిస్తున్నాయి. కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు తిని కాలం వెళ్లదీస్తున్నాయి.. జిల్లాలో గోశాలలపై కలెక్టర్‌ ప్రశాంతి దృష్టి సారించి గోవులను సంరక్షించాల్సి ఉంది. గోవుల ఆలనా పాలనా కరువవుతోంది. వేలాది గోవులు ఆకలితో అలమటిస్తూ అంబా అంటూ రోడ్ల పక్కన సంచరిస్తున్నాయి.. ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో తెలియదు.. జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో పాటు ధవళేశ్వరం, అనపర్తి, దివాన్‌చెరువు, గోకవరం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లోనూ రోడ్లపై గోవుల సంచారం అధికంగా ఉంటుంది. అయినా పట్టించుకునే వారే కరువవుతున్నారు. ఆలయంలో గోవులు కనిపిస్తే పూజిస్తారు. అదే గోవు రోడ్లపై కనిపించడంతో దేవతా స్వరూపం అని మరచి ఛీదరించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ గోశాలలు ఉన్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. దృష్టి సారించాల్సిన పశుసంవర్థక శాఖాధికారులు ఏం పట్టనట్టు కళ్లు మూసుకుంటున్నారు.

ఆవూ.. సంరక్షణ కరువు
గోవులను ఇష్టానుసారం రోడ్లపై వదిలేస్తున్నారు. జంతు సంరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ ఆ మూగజీవాలకు అక్కరకు రావడం లేదు. ప్రభుత్వ గోశాల ఉన్నా.. నిధులు ఉన్నా.. గోశాలలపై ఆదాయం సమకూరుతున్నా రోడ్లపై సంచరి స్తున్న గోవులను పట్టించుకునే నాథులే కరువ య్యారు.గతంలో నగర పాలక సంస్థ, పోలీసులు సమన్వయంతో చర్యలు తీసుకున్నారు. పోలీసులు యజమానులపై కేసులు నమోదు చేసే వారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేటు సంస్థలు గోశాలలు నిర్వహించేవి. కార్పొరేషన్‌ గోశాల ఏమైందో తెలియదు. దీంతో రోడ్లపై గోవులు జనాలకు ఇబ్బందిగా పరిణమించాయి. రోడ్లపై గోవులు వదలడం, సంరక్షణ చూడక పోవడం నేరమని కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సైతం హెచ్చరించడం గమ నార్హం. అయినా యంత్రాంగంలో చలనం లేదు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి గోవేదనపై దృష్టి సారించాల్సి ఉంది.

ఏం జరుగుతోంది!
ఆవులను అక్రమ వధకు తరలించే కేంద్రంగా జిల్లా మారుతోందనే వాదన వినవస్తోంది. గోకవరం, ద్వారపూడి తదితర చోట్ల వారాంతపు సంతలు జరుగుతుంటాయి. అక్కడికి గోవులను తీసుకొచ్చి విక్రయిస్తారు. ఒట్టిపోయిన వాటితో పాటు మామూలు వాటిని తీసుకొస్తున్నారు. ఆ సంతల్లో కొనుగోలు చేస్తున్న వాళ్లు పట్టణాలకు తరలిస్తున్నారు. గ్రామాల్లో అయితే ఒక్క కొత్త గోవు కనబడినా ఆరా తీస్తారు. దాంతో అను పానులు తెలిసిపోతాయి. అందువల్ల రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకే చోట ఎక్కువ సంఖ్యలో గోవులు ఉంటే స్థానికుల ద్వారా సమాచారం బయటకు వెళుతుందని వాటిని రోడ్లపై వదిలేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వాటి వధకు తరలిస్తు న్నారు. నగరం, పట్టణాల్లోనూ వధలు జరుగుతున్నాయని ఆదివారం ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పెంపుడు గోవులనే భావన కలగడం కోసం మెడలో నల్లతాళ్లు, పూసల తాళ్లు కడుతున్నారు. రోడ్లపై ఒక్క గేదె కనిపించదు, గోవులు మాత్రం పదుల సంఖ్యలో పగలూ రాత్రి తేడా లేకుండా సంచరిస్తూనే ఉంటున్నాయి.దీనికి కారణం ఏమి టో లాజిక్‌గా ఆలోచిస్తే ఇట్టే అర్థమవుతుంది.

విచ్చలవిడిగా గోవధశాలలు..
జిల్లాలో గోవధ శాలలు విచ్చలవిడిగా ఉన్నాయి. వాటిపై గతంలో దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి. రాజమహేంద్రవరం, దేవరపల్లి, ధవళేశ్వరం, నిడదవోలు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో గోవధశాలలు ఉన్నాయి. గతంలో ధవళేశ్వరంలో ఉన్న గోవధశాలపై అధికారులు దాడులు చేశారు. ఆ తరువాత ఆ కేసు ఏమైందో తెలియదు. దేవరపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గోవధశాలలు వెలిశాయి.అధికారుల అలక్ష్యంతో పలువురు ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు.

ప్రమాదాల బారిన..
రాజమహేంద్రవరం, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరం, అనపర్తి, నల్లజర్ల ప్రాంతం ఏదైనా రోడ్లపై గోవుల్లేని ఊరు లేదంటే అతిశయోక్తికాదేమో.. గోవులు రోడ్లపై సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. గోవులను తప్పించే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. హైవేపైకి వెళుతున్న గోవులను లారీల వంటి వాహనాలు ఢీకొట్టడంతో మృత్యువాత పడుతున్నాయి. ఇటీ వల దివాన్‌చెరువు – లాలా చెరువు మధ్య జాతీ య రహదారిపై మూడు గోవులు ఆ విధంగా విగత జీవులయ్యాయి. ఐఎల్‌టీడీ సమీపంలోని వాటర్‌ వర్క్స్‌ సమీపంలో కూడా ఒక ఆవు మరణించింది. గోకవరంలో గోవులు రోడ్లపై ఎప్పుడూ కనబడుతూనే ఉంటాయి. రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.