
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించిన భగవద్గీత ద్వారానే ప్రపంచం మొత్తం మారుతుందని, స్థిరమైన అభివృద్ధిని కూడా సాధిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్ అన్నారు. ఆది శంకరాచార్యుల జన్మస్థలమైన కాలడిలోని శ్రీ శారద సైనిక్ స్కూల్‌లో “గీతాయనం” జాతీయ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ భావన దర్శన్ (అందరూ సమానమే, అందరిలో ఆత్మను చూడటం) మే భారత తత్వశాస్త్రమని వివరించారు. దేశాలన్నీ భౌతిక అభివృద్ధి చుట్టే తిరుగుతున్నాయని, దీంతో అసమానతలు తీవ్రంగా ప్రబలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అసమానంగా వున్న సమాజాన్నే చూస్తున్నామని, గీత బోధన సమయంలో అర్జునుడు ఎలా గందరగోళంగా వున్నాడో, అలాంటి సమాజాన్నే చూస్తున్నామని అన్నారు.
గీతలోని ప్రతి శ్లోకమూ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఓ ఉపదేశ శ్లోకమేనని, అందర్నీ జాగృతపరిచేవే అని అన్నారు. ఈశ్వర: స్సర్వ భూతానాం అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందుతోందని ఆనందం వ్యక్తం చేశారు.
ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. శివప్రసాద్ ఈ సెమినార్ కు అధ్యక్షత వహించారు. గీత అంతర్జాతీయంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటోందని ఆయన అన్నారు. సంవత్సరాల క్రితం, అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఇ.కె. నాయనార్ వాటికన్‌లో పోప్‌ను సందర్శించినప్పుడు, ఆయన అందించిన బహుమతి భగవద్గీత. కాలం మరియు రాజకీయాలకు అతీతంగా, గీత భారతదేశ ఆధ్యాత్మికతకు సంబంధించిన పుస్తకమని తెలిపారు.
భారతీయ విచార్ కేంద్ర డైరెక్టర్ ఆర్. సంజయన్ కీలకోపన్యాసం చేశారు. ప్రపంచం భారత్ తత్వాన్ని స్వీకరించే సమయం ఆసన్నమైందని, గీతా ప్రచారన్ ప్రాజెక్ట్ ఆ దిశగా మేల్కొలుపు అని ఆయన అన్నారు. 2026లో తిరువనంతపురంలో అంతర్జాతీయ గీతా సెమినార్ నిర్వహించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.





