News

హక్కులేనా? బాధ్యత ఉండదా?

685views

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఎ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు ప్రభుత్వ ఆస్తికి నష్టం వాటిల్లజేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. హక్కులే కాదు.. బాధ్యతలు కూడా ఉంటాయని నిరసనకారులకు ఆయన స్పష్టం చేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన విగ్రహాన్ని లోక్ భవన్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏది సరైన విధానమనేది ఎవరికి వారు తమను తాము ప్రశ్నించుకుని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ‘మీరు తగులబెడుతున్న ప్రజల ఆస్తులన్నీ మీ పిల్లలకు చెందినవి కావా?’ అని ప్రశ్నించారు. ఈ నిరసనల్లో గాయపడిన ప్రజలు, పోలీసుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవాలని మోదీ అన్నారు. ప్రభుత్వ వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేసేవారు తమకు హక్కులతోపాటు బాధ్యతలు కూడా ఉంటాయన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగంలోని 370 అధికరణ రద్దును ప్రస్తావిస్తూ ఎంతోకాలంగా దేశాన్ని వేధిస్తున్న ఓ రోగానికి సరైన చికిత్సను అందించామని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ వల్ల రకరకాల సమస్యలు తలెత్తాయని, అది పాత రోగంగా మారిపోయిందని మోదీ అన్నారు. ఈ చర్యను వ్యతిరేకించడం ద్వారా లబ్ధి పొందాలని చూసినవారికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మోదీ అన్నారు. ఇలాంటి సమస్య లేకుండా 370 అధికరణ రద్దు అమలైందని ఆయన అన్నారు. అదేవిధంగా రామజన్మ భూమి సమస్య కూడా శాంతియుతంగా పరిష్కారమైందని గుర్తు చేశారు. దశాబ్దాలుగా దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఈ రెండు సమస్యలను తమ ప్రభుత్వం శాంతియుత మార్గాల్లో పరిష్కారాన్ని కనుగొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏపై మాట్లాడుతూ భారతదేశంలో ఉంటున్న ముస్లింలకు ఇతి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యాలని, అక్కడ హిందువులతోపాటు జైనులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్శీలు మైనారిటీలుగా దుర్భర జీవితాన్ని సాగిస్తున్నారని అన్నారు. వారిపై హింసాకాండ రోజురోజుకూ పెచ్చరిల్లిపోతోందని, ఇక అక్కడ అవకాశాలు లేవని నిర్ణయించుకున్న కొంతమంది భారతదేశ సహాయం కోరుతున్నారని అన్నారు. అందుకే వారికి పౌరసత్వం ఇచ్చి, ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు. ఇది ఏవిధంగా భారతదేశంలోని ముస్లింలకు వ్యతిరేకమైనదో ఆందోళన చేస్తున్నవారే చెప్పాలని ఆయన నిలదీశారు. సవాళ్లకు ప్రతిసవాల్ విసరడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.