News

కేవీ పల్లెలో ‘పాండవ గూళ్లు’..!

167views

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలంలో ‘పాండవ గూళ్లు’ బయటపడ్డాయి. మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ ఒంటిల్లుకు సమీపంలోని విశాలమైన బండపై ఉన్న ఈ గూళ్లను స్థానికులు పాండవుల నివాసాలుగా చెబుతున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి అలాగే పిలుస్తున్నామని తెలిపారు. పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో కొంతకాలం ఇక్కడ గడిపారని అప్పట్లో వారు నివసించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారని స్థానికులు భావిస్తున్నారు. ఈ బండపై కేవలం నాలుగు బండరాళ్లతోనే ఐదు గూళ్లు ఏర్పాటు చేసుకున్నారు. మూడు వైపులా మూడు బండలు, పైన ఒక బండతో ఏర్పాటు చేసిన ఈ కట్టడం చూడ్డానికి కొంత ఆశ్చర్యంగానే కన్పిస్తోంది. స్నానపు గదులు, నీటి తొట్టెలను బండరాళ్లతోనే ఏర్పాటుచేసుకున్నారు. ప్రస్తుతం ఆ అయిదు గూళ్లలో మూడు శిథిలమయ్యాయి. కార్బన్‌ డేటింగ్‌ పద్ధతి ద్వారా వీటి వయసును నిర్ధారించవచ్చని, దీనిపై మరింత పరిశోధన జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.