మావోయిస్టులకు ప్రాబల్యమున్న బస్తర్ ప్రాంతంలో మావోలకు గత యేడాది కాలంగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎదురు కాల్పుల్లో హతమవ్వడంతో లేదా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, లేదా నక్సలిజంలో వున్న పెడ ధోరణుల కారణంగా లొంగిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఒక్క యేడాదిలోనే 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
తాజాగా రెండు రోజుల క్రితం బస్తర్ లో 30 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏకంగా 8 లక్షల రివార్డు వున్న కీలక నక్సలైట్ సోను హేమ్లా అలియాస్ కరోటి కూడా లొంగిపోయాడు. మరో 20 మంది మావోయిస్టులపై 81 లక్షల సమష్టి రివార్డు వుంది. వీరు కూడా లొంగిపోయారు.
తామంతా నక్సలిజం లో వున్న డొల్లతనం, అంతర్గత చీలికలు, సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం, చీలికలు, పేలికలు, గ్రూపిజం కారణంగానే విసుగు చెందామని, నక్సలిజంలో ఏమీ లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం రూపొందించిన ‘‘నియాద్ నెలనార్’’ పథకంతో కూడా బాగా ఆకర్షితులయ్యామని, పునరావాస పథకాలు బాగున్నాయని నక్సలైట్లు ప్రకటించారు.
మావోయిస్టు గ్రూపు నుండి విడిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 తక్షణ ఆర్థిక సహాయం అందించారు.అలాగే రాష్ట్ర పునరావాస విధానం యొక్క ప్రయోజనాలను అందజేయనున్నారు.
గత ఏడాది జనవరి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 1500 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. అదే సమయంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ డివిజన్లో వేర్వేరు ప్రచారాలలో భద్రతా దళాలు 400 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టాయి.





