News

తలకోన‌లో శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

160views

తిరుపతి జిల్లాలోని తలకోన‌లో శ్రీసిద్ధేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు భూమిపూజ చేశారు. అంతకుముందు ఆయన బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం ఆలయం, నూతన పుష్కరిణి నిర్మాణానికి ఛైర్మన్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతవరణంలో కొలువైన సిద్ధేశ్వరాలయ జీర్ణోద్ధరణ చేపట్టమన్నారు. ఆలయం శిథిలావస్థలో ఉన్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే నాని టిటిడి దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.19.13 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంతో తలకోన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందన్నారు. మహాశివరాత్రి లోపు ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేస్తామని వివరించారు. శివరాత్రి పర్వదినాన భక్తులకు సిద్ధేశ్వరస్వామి దర్శనభాగ్యం కలిగిస్తామని తెలిపారు. ఉప ఆలయాలు, పుష్కరిణి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.