ArticlesNews

ఉరికొయ్యను చుంబిస్తూ..స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ.. గాదె చిన్నపరెడ్డి

224views

( ఆగస్టు 13 – గాదె చిన్నపరెడ్డి బలిదానం )

దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. అటువంటి మృతంజీవులలో ఒకరు గాదె చిన్నపరెడ్డి. తాను నమ్మిన మార్గంలో ముందుకెళ్లి ఉరికొయ్యను ముద్దాడిన తొలి తరం భారత స్వాతంత్ర్య సమరయోధుడుగా చరిత్రకెక్కిన గాదె చిన్నపరెడ్డి మన తెలుగు తేజం కావడం మనందరికీ గర్వకారణం. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన చిన్నపరెడ్డి వంటి దేశభక్తుల చరిత్రను తెలుసుకోవడం నేటి తరం కర్తవ్యం. గాదె చిన్నపరెడ్డి గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో గాదె సుబ్బారెడ్డి, లింగమ్మ దంపతులకు 1864లో జన్మించారు. ఈయన పెద్దగా చదువుకోలేదు కానీ కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ వంటి అస్త్ర విద్యల్లో ఆరితేరాడు. రామాయణ, మహాభారత కథల్ని సమూలంగా ఔపాసన పట్టారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలతో పాటుగా దానశీలిగా ఉన్న చిన్నపరెడ్డి తన చిన్నతనం నుండే పేదలను ఆకట్టుకున్నాడు. తన ఇంట్లో పండించిన పంటను పేదలకు పంచడం అలవర్చుకున్న చిన్నపరెడ్డి యుక్త వయసుకు రాగానే ప్రజల పక్షాన పోరాటం చేయడం మొదలు పెట్టాడు.

ఆ రోజుల్లో చేబ్రోలు, నాదెండ్ల ప్రాంతాల్లో పెత్తందార్లు బ్రిటిషర్లకు వంతపాడుతూ ప్రజలపై ఇష్టారాజ్యంగా పన్నులు వేసేవారు. దీనిపై కన్నెర్రజేస్తూ చిన్నపరెడ్డి ప్రజాపక్షం వహించాడు. శ్రమకు తగిన ఫలితం అంటూ విప్లవం తీసుకువచ్చాడు. సామాన్యులకు సైతం గుర్రపు స్వారీ నేర్చుకునే అవకాశం కల్పించారు. కచ్చరం ప్రయాణాన్ని ప్రోత్సహించాడు. కరువు కాటకాల సమయంలో బ్రిటిష్ వారి అజమాయిషీలో ఉన్న ధాన్యగారాలపై దాడి చేసి కొల్లగొట్టిన ధాన్యాన్ని పేదలకు, నిర్భాగ్యులకు పంచి పెట్టడాన్ని ఒక బాధ్యతగా కొనసాగించాడు. రైతులు పండించిన నీలిమందును గుర్రాల ద్వారా మద్రాసుకు తీసుకువెళ్లి, అక్కడ కూవం నది ఒడ్డున ఉండే తెలుగువారి విక్రయకేంద్రాల ద్వారా వ్యాపారం నిర్వహిస్తూ దళారుల బెడద లేకుండా చేశాడు.

చిన్నపరెడ్డి 1907లో మద్రాసు సంతకు వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ప్రకాశం పంతులు, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకుల సభలలో పాల్గొన్నాడు. వందేమాతరం విన్నాడు. అంతే, ఆయన నరనరాల్లో నూతనోత్తేజం ఫెల్లుబికింది. అచంచలమైన దేశభక్తితో గుండె వేగం పెరిగింది. ఉడుకు రక్తం మరిగింది. అదివరకే బ్రిటిష్ అధికారుల కిరాతక చర్యలను వ్యతిరేకిస్తూ వచ్చిన చిన్నపరెడ్డి వందేమాతరం నినాదంతో సమర సైన్యాన్ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్నాడు. చేబ్రోలు తిరిగివచ్చాక అనుకున్న ప్రకారం జనసమీకరణ చేసి స్వతంత్ర పరమార్థాన్ని ప్రజలకు వివరించడం మొదలు పెట్టాడు. వందేమాతరం మనదే రాజ్యం నినాదాన్ని సృష్టించుకుని పెద్ద ఎత్తున దండును తయారు చేసుకుని సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం నింపడం ప్రారంభించాడు. ప్రజలను ఉత్తేజపరిచేందుకు ఆటపాటల కార్యక్రమాలను కూడా కొనసాగించాడు.

చిన్నపరెడ్డికి ప్రజల్లో మద్దతు పెరుగుతూ వచ్చింది. ఇది బ్రిటిష్ అధికారులకు నచ్చలేదు. చిన్నపరెడ్డిని పక్కలో బల్లెంగా భావించి మట్టుపెట్టడానికి పథకాలు మొదలు పెడుతూ ఆటంకాలు సృష్టించసాగారు. ఎక్కడ ఏ గొడవ జరిగినా, అల్లరి జరిగినా అది చిన్నపరెడ్డి మీదకి అభియోగంగా మోపబడేది. ఇదిలా ఉంటే, చిన్నపరెడ్డి గొప్ప శివభక్తుడు. ప్రతి శివరాత్రికి 60 అడుగుల ప్రభను తయారు చేయించి శివుడికి సమర్పించుకునేవాడు. అలా 1909 ఫిబ్రవరి 18న ప్రభను సిద్ధం చేసుకొని అలంకరించిన తన ఎద్దులతో కోటప్పకొండకు తన అనుచరులతో వెళ్లాడు. అదే సమయంలో తిరునాళ్లలో చెలరేగిన ఘర్షణ పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు, చిన్నపరెడ్డి ఎద్దులతో పాటు మరో ఇద్దరు పోలీసు జవానులు కూడా మరణించారు. ఈ సంఘటనను సాకుగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం చిన్నపరెడ్డి మీద, అతడి 100 మంది అనుచరుల మీద కేసు పెట్టింది.

చిన్నపరెడ్డితో పాటు 21 మందికి ఉరిశిక్షలూ, 24 మందికి కఠిన శిక్షలు విధిస్తూ గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ తీర్పు చెప్పాడు. చిన్నపరెడ్డి దీన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టుకి వెళ్లాడు. మీకు కావాల్సింది తాను కాబట్టి తనను ఉరి తీసుకొని, మిగిలిన వారిని వదిలివేయమన్నాడు. ఆ దేశభక్తుడి మాటలు బ్రిటిష్ పాలకుల చెవికెక్కలేదు. 1910 ఆగస్టు 13న చిన్నపరెడ్డికి ఉరిశిక్షనూ, 21మందికి ద్వీపాంతర శిక్షలను విధిస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి మన్రో తీర్పు చెప్పాడు. దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి చిరునవ్వుతో ఉరితాళ్లని ముద్దాడాడు. చిన్నపరెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీసిన తర్వాత స్వాతంత్ర్యోద్యమ జ్వాలలు జనాల్లో మరింత పెరిగాయి. ఆవేశం అగ్గి బరాటాలా వెలిగింది. కాంక్ష భగభగ మండింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టేవరకు నిద్ర పోలేమనే శపథాలు ఊరూరున వినిపించాయి. ఉరికొయ్యకు వేలాడి సైతం శత్రువును ఉరిమి చూసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తర్వాత అంతటి వీరత్వాన్ని చూపిన మరో ధీరోదాత్తుడు చిన్నపరెడ్డి. ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అని నిరూపించిన మహాయోధుడు చిన్నపరెడ్డి.