
భారత సంస్కృతి సంప్రదాయాలను సంరక్షిస్తూ, దేశ సమైక్యతకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవలు ప్రశంసనీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో కేశవ స్మృతి మండలి నూతన భవన నిర్మాణానికి అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీ విరజానంద స్వామి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎంతో క్రమశిక్షణతో కూడిన వారన్నారు. నిమిదో ఏట నుంచి ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లేవాడినని తద్వారా క్రమశిక్షణ, మంచి నడవడిక ఆలబడ్డాయి అన్నారు. పిల్లలకు చిన్నప్పటినుంచే పెద్దలను గౌరవించే సంస్కృతి, దేశం పట్ల భక్తి అలవాడేలా సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు. ప్రపంచంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజ సేవకు అంకితమయ్యే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని కొనియాడారు. ఇటువంటి సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో తాము కూడా భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థలదాతలు శ్రీ భగవాన్ బాలసాయి సెంట్రల్ ట్రస్టీ రామారావు, ఆదర్శ అనంతయ్య, ఆర్ఎస్ఎస్ అఖిలభారత సేవా ప్రముఖ సెంథిల్, క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, మేయర్ బి వై రామయ్య, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.




