
( ఆగస్టు 12 – రణరంగ చౌక్ సంస్మరణ దినోత్సవం )
ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాటానిది. ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తెనాలి కీలక పాత్ర పోషించింది. డూ ఆర్ డై పేరుతో సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో తెనాలిలో జరిగిన పోరాటం బ్రిటిష్ పార్లమెంట్‌ను సైతం భయపెట్టింది. ప్రపంచ పటంలో తెనాలి ఎక్కడ..? అంటూ చర్చిల్ సైతం ఆరా తీశారు. తెనాలి పట్టణవాసులపై సామూహిక జరిమానా విధించి, నానా అగచాట్లకు గురి చేశారు. స్వతంత్ర పోరులో తెనాలి తెగువ ఆనాటి ప్రజల్లో స్వేచ్ఛా కాంక్షను రగిల్చింది. ఏడుగురి ప్రాణ త్యాగంతో తెగించి సమరభేరి మోగించేలా ప్రజల్లో స్ఫూర్తి నింపింది.
స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1942 ఆగస్టు 8న ముంబయిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో గాంధీజీ చేసిన ప్రసంగం క్విట్ ఇండియా తీర్మానానికి దారి తీసింది. ముంబయి సమావేశంలో పాల్గొన్న కల్లూరి చంద్రమౌళి తెనాలికి తిరిగివచ్చి స్థానికులతో కలిసి ఆగస్టు 12న బంద్‌కు పిలుపునిచ్చారు. తాలూకా హైస్కూల్, భారత్ ట్యుటోరియల్ కాలేజీ విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి, సంపూర్ణ బంద్ తలపెట్టారు. తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ ర్యాలీ చేశారు. రైల్వేస్టేషన్‌ను పూర్తిగా తగులబెట్టిన సత్యాగ్రహులు తాలూకా కార్యాలయాన్ని ముట్టడించేందుకు కదిలారు. ఈ క్రమంలో పాత బస్టాండు సమీపంలో పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ సత్యాగ్రహులు ముందుకు దూసుకెళ్లారు. పోలీసులు 21 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా వెరవకుండా తూటాలకు సత్యాగ్రహులు గుండె చూపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు సత్యాగ్రహులు అమరులవగా, మరెందరో గాయపడ్డారు. పోరాటానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్లు జైలుశిక్ష విధించింది.
భరతమాతకు స్వేచ్ఛావాయువులను అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు, శిరిగి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు. భరతమాత ముద్దుబిడ్డల రక్తంతో తడిసిన ఆ పవిత్ర స్థలంలో, పోలీసు కాల్పుల్లో దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఆ ప్రదేశంలో, ఆ మహనీయుల త్యాగాలకు గుర్తుగా కాల్పులు జరిగిన ప్రదేశంలో 1959లో స్మారకం నిర్మించారు. దానికి రణరంగ చౌక్‌గా నామకరణం చేశారు. ఏడుగురు అమరవీరులకు గుర్తుగా ఏడు స్తంభాలు, వాటికి ముందువైపు భరతమాత ఒడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది.
ప్రతి ఏటా ఆగస్టు 12న రణరంగ చౌక్ వద్ద ఆ ధన్యజీవులను స్మరించుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తెనాలిలో ఎలాంటి దేశభక్తి కార్యక్రమం జరిగినా అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వారి త్యాగం సదా చిరస్మరణీయం.




