
గుంటూరులో క్రేన్ రెలిజియస్ ట్రస్టు వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మ దంపతుల స్ఫూర్తితో ప్రస్తుత ఛైర్మన్ గ్రంథి కాంతారావు.. వేదవిద్యకు ఊతంగా నిలిచేందుకు వేద పాఠశాలను నిర్మించారు. ఇక్కడ విద్యార్థిగా చేరితే ఉచితంగా విద్య, వైద్యవసతి, భోజన తదితర సౌకర్యాలను పొంది పండితుడిగా ఎదిగి బయటకు వెళ్లి ఉపాధి పొందేలా ప్రణాళిక సిధ్ధం చేశారు. విజయవాడ-చెన్నై హైవే పక్కన గుంటూరు అంకిరెడ్డిపాలెంలో క్రేన్ రెలిజియస్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్త పాఠశాల సిద్ధమైంది. చినజీయర్ స్వామి ఈ పాఠశాలను ప్రారంభిస్తారు. చతుర్వేద పురుషులు తమ పత్నుల సమేతంగా ఇక్కడ విగ్రహాలుగా దర్శనమిస్తుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఏటా 50 మందికి ప్రవేశం
‘‘ఈ పాఠశాల నిర్మాణం.. మా నాన్న గ్రంథి సుబ్బారావు, లక్ష్మీనరసమ్మల ఆశయం. ఇక్కడ కృష్ణ యజుర్వేదం, ఆపస్తంభ స్మార్తం, శైవాగమం, వైఖానసాగమం నేర్పిస్తాం. ప్రస్తుతం ఏటా 50 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. ఆరేళ్ల బోధనలో వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్, ఏఐ తరగతుల బోధన కూడా ఉంటుంది. ప్రశాంత వాతావరణం, త్రికాల సంధ్యావందనం, నిష్ణాతులైన పండితులతో విద్యాబోధన, ప్రత్యక్ష పర్యవేక్షణ ఉంటాయి. నిత్య, ధూప, దీప నైవేద్యాలు, అర్చనలు, అభిషేకాలతో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది. యాగాలు, హోమాల్లో ప్రత్యక్ష శిక్షణ.. చండీ, పంచాంగ పరిజ్ఞానంలో శిక్షణ ఉంటాయి. చక్కని భోజనం, వసతి, క్రీడల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి ఏటా పండితులతో సదస్సులు నిర్వహిస్తాం. ఈ పాఠశాల పూర్తి సంప్రదాయ వాతావరణంలో ఉండాలని చెట్టినాడ్ శైలి మండువా లోగిళ్లలో నిర్మించాం. 40,000 వేద, పురాణ గ్రంథాలతో సంస్కృత పరిజ్ఞాన మహా గ్రంథాలయం ఏర్పాటుచేశాం. తల్లిదండ్రులకు మేం చెప్పేది ఒక్కటే.. మీ పిల్లవాడిని విద్యార్థిగా చేర్చండి.. పండితునిగా తీసుకెళ్లండి. సమాజానికి మేలు చేయాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలన్నదే మా ఆశయం’’.-క్రేన్ రెలిజియస్ ట్రస్టు ఛైర్మన్ గ్రంథి కాంతారావు




