
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళ రాజులు ఈ ఆలయ ఆలనాపాలన చూసుకున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ దేవుడు పూజలు అందుకొంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని పలువురు వీరశైవులకు ఈ దైవమే ఇలవేల్పు. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు.
ఏటా సూర్య కిరణాల అభిషేకం: సాధారణంగా శివాలయాల్లో స్వామికి ఎదుట ఒక నంది మాత్రమే కనిపిస్తుంది. రాయచోటి వీరభద్రాలయంలో మాత్రం ధ్వజస్తంభం నుంచి ప్రధాన ఆలయం వరకు అయిదు నందులు దర్శనమిస్తాయి. వీటిని మహా, ప్రధాన, యోగ, బోగ నందులుగా వ్యవహరిస్తుంటారు. ఏటా మార్చి, సెప్టెంబరు మాసాల్లో వీరభద్రుడి పాదాలను సూర్య కిరణాలు స్పృశించే దృశ్యాలు కనిపిస్తాయి.

ఇదీ స్థల పురాణం: దక్ష ప్రజాపతి తాను నిర్వహించే యజ్ఞానికి కుమార్తె సతీదేవి, శివుడిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో హాజరైన సతీదేవిని దక్షుడు అవమానించడంతో ఆమె అగ్నికి ఆహుతవుతారు. ఆగ్రహించిన శివుడు జటాజూటాన్ని నేలపైకి విసరడంతో వీరభద్రుడు ఉద్భవించి తన ఖడ్గంతో దక్ష ప్రజాపతి శిరస్సు ఖండిస్తారు. అనంతరం వీరభద్రుడిని శివుడు శాంతింపజేయగా మహామునీశ్వరుని తపస్సు మెచ్చి భద్రకాళీ సమేతుడై రాయచోటిలోని మాండవ్య నదీ తీరాన కొలువయ్యారు.




