
జగన్నాథ నామస్మరణతో విశాఖ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, హరినామ సంకీర్తనలు, భజనలు, కోలాటాలు, విష్ణు సహస్రనామ పారాయణలతో నగరంలోని పలు ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి.
జగన్నాథస్వామి రథయాత్రల్లో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి రథయాత్ర 185 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు.
జిల్లా పరిషత్ శ్రీకృష్ణ మందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. సాయంత్రం 5 గంటలకు టౌన్ కొత్తరోడ్డు నుంచి ప్రారంభమైన రథయాత్ర ఏవీఎన్ కాలేజీ డౌన్ రోడ్డు, పూర్ణా మార్కెట్, ఆంజనేయస్వామి ఆలయం మీదుగా టర్నర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది.
అనంతరం బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథస్వామి ఉత్సవ విగ్రహాలను టర్నర్ చౌల్ట్రీలోని కల్యాణ మండపంలో ప్రతిష్ఠించారు. ఈ నెల 17 నుంచి 26 వరకు స్వామివారు దశావతార అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆలయ ఈవో టి. రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ రథయాత్రను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాణంగిపల్లి రంగనాథాచార్యులు, జగన్నాథాచార్యులు, యేడిద సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని రథయాత్రలో పాల్గొన్నారు. భక్తుల జయజయధ్వానాలు, హరినామ సంకీర్తనల మధ్య రథయాత్ర భక్తి, సంప్రదాయాల వైభవాన్ని చాటింది.





