ArticlesNews

వందేళ్లైనా వన్నె తగ్గని చీరాల-పేరాల ఉద్యమ స్వరం

244views

బాపట్ల జిల్లాలోని చీరాల-పేరాల ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మహోజ్వల ఘట్టం. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊపిరిలూదిన సందర్భంగా, బ్రిటిష్‌ పార్లమెంటులో వాడీవేడి చర్చ రేకెత్తించిన అంశంగా నిలిచింది. ఓ ఊరంతా పుర బహిష్కరణ చేసి నిరసన తెలపటం, ఇలాంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అరుదని చెబుతుంటారు. అలాంటి పోరాటానికి నాంది పలికిన వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ప్రతి ఒక్కరిలోనూ పోరాట కాంక్షను రగిల్చి యావత్‌ దేశాన్ని, మహాత్మాగాంధీ దృష్టినీ తనవైపు తిప్పుకొన్న గొప్ప నాయకుడు ఆయన. ఆ ఉద్యమం, ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కనుమరుగై చారిత్రక విషాదంగా నిలిచే ప్రమాదం కనబడుతోంది.

ఇదీ చరిత్ర
స్వాతంత్య్రోద్యమ కాలంలో చీరాల, పేరాల రెండు పంచాయతీలుగా ఉండేవి. 1919లో ప్లేగు వ్యాధి వ్యాపించటంతో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం దానిపై కమిటీ వేయగా, దాని సూచనల మేరకు రెండు పంచాయతీలను కలిపి 1920లో మున్సిపాలిటీగా ప్రకటించారు. దీంతో పన్నులు భారీగా పెరిగాయి. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న ఆ నిర్ణయంతో రెండు పంచాయతీల ప్రజలు సహాయ నిరాకరణ చేపట్టారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా శాంతియుతంగా నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్‌ సర్కారు కొంత మందిపై కేసులు పెట్టి జైలుకు పంపింది.

అప్పట్లో మహాత్ముడి నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతుండటం, సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆయన పిలుపివ్వడం.. విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభ నేపథ్యంలో తన రామదండు సేవా కార్యక్రమాలతో చీరాల-పేరాల ఉద్యమ కర్త దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.. గాంధీ, ముఖ్యనేతల దృష్టిని ఆకర్షించారు. గాంధీ, ముఖ్య నేతలు 1921 ఏప్రిల్‌ 6న చీరాలకు వచ్చారు. రామ్‌నగర్‌ వద్ద ప్రజలు పెద్దఎత్తున ఆయనకు స్వాగతం పలకడం, అనంతరం జైలుకెళ్లిన వారిని గాంధీజీ స్వయంగా సన్మానించడం, తదనంతరం జనమంతా పుర బహిష్కరణకు దిగడం.. ఇలా ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఆ ఉద్యమం వేదికైంది. ఇలా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చారిత్రక ఉద్యమానికి సారథిగా మారారు.

ప్రస్తుతం ఈ చీరాల-పేరాల ఉద్యమ ఆనవాళ్లు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జ్ఞాపకాలు క్షేత్రస్థాయిలో కనుమరుగవుతున్నాయి. ఆయన సమాధి ఎక్కడుందో తెలియని దుస్థితి. ఆయన సమాధి ఉన్నట్లు చెప్పే ప్రాంతంలో ఇప్పుడు ఆర్టీసీ గ్యారేజీకి చెందిన పెద్ద గోడ కనిపిస్తోంది. దీనిపై స్థానికుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. చీరాల-పేరాల ఉద్యమ ఆనవాళ్లను పరిరక్షించడంతో పాటు స్మారకం ఏర్పాటుపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సమాధి ఆనవాళ్లనూ గుర్తించాలని చీరాలకు చెందిన సంఘసేవకుడు సరివిశెట్టి సుబ్బరామయ్య తదితరులు కోరుతున్నారు.