
వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకం
దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి ఉద్భవించిన ఆదిశక్తే శ్రీమహాలక్ష్మి. శ్రీసూక్తం కీర్తించిన వైకుంఠపుర సామ్రాజ్ఞి ఆమె. ఆ తల్లిని పూజిస్తే సకల సంపదలు, సౌఖ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. విష్ణుపురాణంలో విశ్వమాతగా కీర్తిపొందిన శ్రీలక్ష్మి సకల వరప్రదాయిని. అందుకే ఆమె వరలక్ష్మిగా భక్తులకు మరింత చేరువయ్యింది.
వరలక్ష్మీదేవి శ్రావణ మాసంలో ప్రత్యేకంగా పూజలందుకొంటుంది. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలందరూ వరలక్ష్మీ వ్రతాన్ని విశిష్టంగా జరుపుకొంటారు. ఇది అన్ని కోర్కెలూ తీర్చే వ్రతమని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి చెప్పాడని పురాణాలు పేర్కొన్నాయి. ఆ గిరిజాదేవి తొలిసారిగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, నవరత్న ఖచితమైన లంకానగరాన్ని పొందిందట. ఎలాంటి భేదభావం లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చని పరమ శివుడే సెలవిచ్చాడు. సకల సౌభాగ్యాలకూ మూలం ఈ వరలక్ష్మీవ్రతం అన్నది పెద్దల మాట. ఈ వ్రతం వరలక్ష్మీదేవి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలతో ప్రారంభమై, వ్రతకథా పఠనంతో ముగుస్తుంది.
ఎన్నో నామాలు
శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన, ఆ స్వామి జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అందువల్ల మిగిలిన లక్ష్మీపూజలకంటే ఇది శ్రేష్ఠమైనదని చెబుతారు. ఈ వ్రతం ద్వారా లక్ష్మీ నారాయణుల ఇద్దరి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కోరికలు నెరవేరడానికి, నిత్యసుమంగళిగా ఉండటానికి, సర్వసంపదలూ సిద్ధించడానికి స్త్రీలు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ‘‘నమస్తే లోకజననీ.. నమస్తే విష్ణువల్లభే.. త్రాహిమాం భక్తవరదే.. వరలక్ష్మీ నమోనమః’’ అని నీరాజనాలు పలుకుతారు. వరలక్ష్మీదేవికి ఎన్నో నామాలు, రూపాలు ఉన్నాయి. ఏ నామంతో పిలిచినా అమ్మ ఆలకిస్తుందని, ఏ రూపంలో కొలిచినా కోరికలు తీరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు..
క్షీరసముద్రరాజ తనయ, శ్రీరంగ ధామేశ్వరి, త్రైలోక్యకుటుంబిని, ముకుంద మోహిని ఇలా ఆ తల్లి పేర్లు ఎన్నని చెప్పగలం. ఇక రూపాలు గమనిస్తే వాటి లెక్క చాలా ఎక్కువే. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సస్యలక్ష్మి, సంక్రాంతిలక్ష్మి, సంగీతలక్ష్మి, సాహిత్య లక్ష్మి, వనలక్ష్మి, వసంతలక్ష్మి, వైభవలక్ష్మి, వైకుంఠలక్ష్మి, కల్యాణలక్ష్మి, మోక్షలక్ష్మి ఇలా అనేక రూపాల్లో దర్శనమిస్తుంది.
అమ్మ ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆయుష్షు, సౌఖ్యం, సౌభాగ్యం, సంపద అన్నింటినీ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. లౌకిక సుఖంతో పాటు, మోక్షసంపదనూ కటాక్షిస్తుంది. అందుకే వరలక్ష్మీదేవిని సామాన్యులు సంపదల కోసం ప్రార్థిస్తే, మహర్షులు మోక్ష సంపద కోసం సేవించారు.
బంధంలోని ఆనందం
వరమహాలక్ష్మి విద్యాలక్ష్మి పేరుతో సరస్వతీమాతగా సకల విద్యలూ ప్రసాదిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి పేరుతో సర్వసంపదలూ అందిస్తుంది. సౌభాగ్య లక్ష్మి పేరుతో పార్వతీదేవిగా సౌమంగళ్యాన్ని అనుగ్రహిస్తుంది. త్రిమూర్తులు ముగ్గురైనా త్రిమాతలు ఒక్కటే. అదే శక్తి స్వరూపం. వరలక్ష్మీ దేవి త్రిమాతాత్మక మూర్తిగా, శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటూ విద్య, ధన, సౌభాగ్యాలను ఏక కాలంలో కటాక్షిస్తుంది. కమలగా, పద్మగా, రమగా, ఇందిరగా, భార్గవిగా, హరిప్రియగా సహస్ర నామాలతో కీర్తిపొందుతుంది. లక్ష్మీశక్తిని తన హృదయ స్థానంలో నిలుపుకొన్నాడు శ్రీమహావిష్ణువు. భర్త అనురాగానికి, తనకిచ్చిన గౌరవానికి ముగ్ధురాలైన లక్ష్మీదేవి స్వామిని సేవిస్తూ ప్రేమను చాటుకుంటుంది. ప్రస్తుత యువత ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే భార్యాభర్తల బంధంలోని అందం, ఆనందం అర్థమవుతాయి.
వ్రతాన్ని ఆచరించి, మహాలక్ష్మి వరలక్ష్మీదేవిగా చారుమతిని కటాక్షించిన వ్రతకథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వ్రతం నాడు తొమ్మిది ముడులు వేసి, పసుపు కుంకుమలతో అద్దిన తోరాన్ని వరలక్ష్మీదేవికి సమర్పించి, చేతికి ధరిస్తారు. దానివల్ల ఇంట్లో నవధాన్యాలు నిండి ఆహారానికి, సంపదకు లోటు ఉండదని నమ్ముతారు. తన స్వామితో సహా ఇంట్లో కొలువుండమని ఆ వరాల తల్లిని ప్రార్థిస్తే తప్పక అనుగ్రహిస్తుందని మహిళలు బలంగా విశ్వసిస్తారు.





