ArticlesNews

‘గాజా గోల ఎందుకు? ఈ దేశం పట్టదేం మీకు?’

260views

ఆ దేశభక్తి ఏదో మీ సొంత దేశవాసులు ఎడల చూపించండి!’ అని కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసింది బొంబాయి హైకోర్టు. జూలై 25న ఆ న్యాయస్థానం ఆదేశం బహుశా కోర్టుని ఆశ్రయించిన వారిని కంగు తినిపించి ఉంటుంది. కోర్టుకు వెళ్లినవారు ఎవరో కాదు, సీపీఐ(ఎం). హమాస్ మీద టన్నులు కొద్దీ సానుభూతి కురిపిస్తారు. మార్కిస్టులు, వారి తైనాతీ మేధావులు, వియత్నాం మీద అమెరికా దాడికి నిరసనగా ఆ పార్టీ విద్యార్థి సంఘాలు రోజుల తరబడి కాలేజీలు, పాఠశాలలు మూయిస్తాయి. కానీ కాశ్మీర్లో పండిత్ల ఊచకోత గురించి నోరు విప్పరు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.

ఈ పార్టీ సంగతి, దేశంలో ఉదారవాదుల గురించి కోర్టు బాగా గ్రహించిందేమో చక్కని ఆదేశం ఇచ్చింది. అందులో చక్కనైన సందేశం కూడా ఉంది. గాజాలో జరుగుతున్న జన హననానికి నిరసనగా తాము ఆజాద్ మైదానంలో నిరసన ప్రదర్శన నిర్వహించదలిచామని, కానీ పోలీసులు అనుమతి నిరాకరించారని, కోర్టు వారు దయతో అనుమతి ఇప్పించాలని సీపీఎం కోరింది. ఈ పిటిషన్ అసలు విచారించ దగినదే కాదు అంటూ కొట్టి పారేసింది బార్ బెంచ్, ఈ పిటిషన్ను చూడబోతే సీపీఎం నిరసన కార్యక్రమం అనుమతి కోసం అభ్యర్థిస్తున్నట్టు లేదని, ఆల్ ఇండియా సాలిడారిటీ ఆర్గనైజేషన్ కోరిన అనుమతిని పోలీసులు నిరాకరించడాన్ని సవాలు చేస్తున్నట్టు మాత్రమే ఉందని కోర్టు వారు తేల్చారు. ఈ సందర్భంలో మొదట మన దేశ ప్రజల పట్ల మీ దేశభక్తిని ప్రదర్శించండి’ అని హితవు కూడా పలికింది న్యాయస్థానం.

ఇంతకీ గాజాలో జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాలని సదరు ఆర్గనైజేషన్ జూన్ 17న బొంబాయి పోలీసులను కోరింది. వారు కుదరదని చెప్పారు. ఇందుకు కోర్టును ఆశ్రయించినది మాత్రం సీపీఎం, అసలు బొంబాయి పోలీసులు అనుమతి నిరాకరిస్తే అందుకు కోర్టుకు రావడానికి సీపీఎంకు ఎలాంటి అర్హత లేదని కూడా చీవాట్లు పెట్టింది. అనుమతి కోసం దరఖాస్తు చేసింది అదేదో ఆర్గనైజేషన్ అయితే మధ్యలో వీళ్లకెందుకు అన్నదే ఇక్కడ ప్రశ్న. నిరసన ప్రదర్శన కోసం అనుమతి కోరినది సీపీఎం కాదు కదా మరి! కొన్ని వేల మైళ్లకి అవతల ఎక్కడో ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమస్య కంటే, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల గురించి పట్టించుకోవచ్చు కదా అని కూడా జస్టిస్ రవీంద్ర ఘూఘే, జస్టిస్ గౌతమ్ అనడ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘మన దేశంలోనే పరిష్కరించవలసిన సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటి గురించి మనకేం పట్టదు. ఇలా అంటున్నందుకు మీరే అనుకోవద్దు. మీది మరీ హ్రస్వదృష్టి, మీరు గాజా సమస్య వైపు చూస్తున్నారు. మన దేశంలో సమస్య ఎందుకు పట్టదు మీకు. దేశభక్తు లుగా ఉండండి. గాజా గురించీ, పాలస్తీనా గురించీ మాట్లాడడం దేశభక్తి కాదు. మన దేశం గురించి, ఇక్కడి సమస్యలు గురించి మాట్లాడడండి. మీరు చెప్పే సిద్ధాంతాలను ఆచరణలో చూపండి’ అని ఘూఘే వ్యాఖ్యానించారు. సీపీఎం స్థానిక సంస్థలు ఎదుర్కొంటున్న చెత్తాచెదారం సమస్య, కాలుష్యం, మురుగునీటి పారుదల, వరదలు వంటి అంశాలను పట్టించుకోవాలి అని కూడా గుర్తు చేశారు. మీ సంస్థ భారతదేశంలో రిజిస్టరయి ఉంది. ఇక్కడి సమస్యలు పట్టించుకుంటే మంచిది. వాటిని కేవలం ఉదాహరణగా చెప్పాం. కానీ మీరు ఆ సమస్యల గురించి నిరసనలు తెలియచేయడం లేదు. కానీ వేల మైళ్లకు అవతల ఉన్న ప్రాంతంలో జరిగిందాని గురించి నిరసన చేపట్టాలనుకున్నారు.

అలాంటి వాటి గురించి ఆలోచించడానికి దేశంలో విదేశ వ్యవహారాల శాఖ ఉంది, మంత్రిత్వ శాఖ ఉంది అని గట్టిగానే వీపు వాయించింది. ఇవన్నీ ‘లైవ్ లా’లో వెలువడినాయి. గాజా విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికీ, మీ ఆలోచనకీ మధ్య చాలా అంతరం ఉందని కోర్టు వారికి గుర్తు చేసిందని లైవ్ లా వ్యాఖ్యానించింది. పాలస్తీనాను సమర్థించినా, ఇజ్రాయెల్ను సమర్ధించినా దానితో వచ్చే వివాదాలను మీరు చూసుకోవాలి. మీ ఆలోచన వల్ల దేశ విదేశాంగ విధానం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి అని జస్టిస్ ఘూఘే హెచ్చరిం చారు. బొంబాయిలో తలపెట్టిన గాజా అనుకూల ప్రదర్శనను పోలీసులు ఏ కారణంతో నిరాకరించారో సీపీఎం తరఫున హాజరైన న్యాయవాది మిహిర్ దేశాయ్ కోర్టుకు నివేదించారు. ఒకటి- అది భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకం. రెండు-శాంతిభద్రతలకు చాలా సమస్య నిర్దేశించిన ప్రదేశాలలో నిరసన తెలియచేసే హక్కు ప్రజలకు ఉందని, ఇందుకు విదేశాంగ విధానంతో నిమిత్తం లేదని సుప్రీంకోర్టు కూడా ఈ హక్కును కాపాడుతూ అనేక తీర్పులు ఇచ్చిందని మిహిర్ దేశాయ్ పేర్కొన్నారు. అయితే గాజా అనుకూల ప్రదర్శనకు అనుమతి ఇస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని పోలీసు శాఖకు హెచ్చరికలు అందాయని కాబట్టి శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.