
సనాతన ధర్మంలోని సమ్మిళిత స్ఫూర్తి ప్రస్ఫుటంగా ప్రపంచానికి కనిపించింది. కర్నాటక కోప్పల్ జిల్లాలోని కొప్పుల గవి సిద్ధేశ్వర మఠంలో ఓ ముస్లిం మహిళ వారం రోజుల పాటు ధ్యానం చేస్తోంది. ఆలయంలోని నాగదేవత మూర్తి ముందు అత్యంత అంకిత భావంతో, శ్రద్ధతో ధ్యానం చేస్తోంది. దీంతో ప్రతిరోజూ మఠాన్ని సందర్శించే వారందర్నీ ఈ ఘటన ఆకర్షిస్తోంది.
హసీనా బేగం యెల్బుర్గా తాలూకాోని కుద్రేముత్తి గ్రామంలో వుంటారు. వంట మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, ప్రశాంతత కోసం ఈ మఠానికి వచ్చి, వారం రోజులుగా ధ్యానం చేస్తోంది.
గత వారం రోజులుగా తన విధులు ముగించుకొని, మఠానికి వెళ్తోంది. అక్కడే వుండే స్వామీజీకి నమస్కరించి, ఓ గంట పాటు నాగ దేవత ముందు ధ్యానంలో కూర్చుంటోంది. దీంతో ఓ ముస్లిం మహిళకి హిందూ ధర్మంపై ఎంత అచంచలమైన నమ్మకం వుందో తెలుస్తోంది. గత 13 సంవత్సరాలుగా ఈ మఠంలో వుండే స్వామీజీని తాను విశ్వసిస్తున్నానని చెప్పుకొచ్చారు.
‘‘గత 13 సంవత్సరాలుగా నేను మఠంలోని స్వామీజీని విశ్వసిస్తున్నా. అలాగే నాగప్ప, బసవన్నలను కూడా పూజిస్తాను. వారి ఆశీర్వాదాలు నాకు, నా పిల్లలకు లభించాయి. మార్గాలు వేరైనా.. అన్ని మతాలూ ఒక్కటే. అన్నింటి గమ్యస్థానం శాంతి. మానసికంగా బాధపడుతున్న సమయంలో ఇక్కడ ధ్యానం చేయమని స్వామీజీ నాతో చెప్పారు. అప్పటి నుంచి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నా. చాలా శాంతి లభిస్తోంది. ’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
ఇక.. స్వామీజీ కూడా స్పందించారు. ‘‘మా ధర్మం వివక్షను బోధించదు. కరుణను బోధిస్తుంది. శాంతిని కోరుకునే వారెవ్వరైనా వారికి స్వాగతం పలుకుతున్నా. హసీనా బేగం నిజాయితీ గల భక్తురాలు. ఆమె చేస్తున్న సాధనను గౌరవిస్తా’’ అని పేర్కొన్నారు.





