
తిరువనంతపురం: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టంలో నిర్దేశించిన ప్రమాణ స్వీకార పదజాలాన్ని యథాతథంగా అనుసరించాలని, దేవతలు, ‘భారత్ మాత’, సంస్థలు, రాజకీయ అమరవీరులు లేదా ఇతర వ్యక్తుల పేర్లను ప్రమాణంలో చేర్చడం చట్టబద్ధం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేరళ మున్సిపాలిటీ చట్టం, కేరళ పంచాయతీ రాజ్ చట్టంలోని నిబంధనలను ప్రస్తావిస్తూ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
హైకోర్టు పరిశీలనలో భాగంగా, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం సమయంలో ‘భరతాంబ’, ‘భారత్ మాత’, ‘గురుదేవ్’తో పాటు తమ రాజకీయ ఉద్యమాల అమరవీరుల పేర్లను ప్రస్తావించినట్లు గుర్తించింది. అలాగే పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరి గ్రామ పంచాయతీకి చెందిన ఒక సభ్యుడు ‘దైవ కృపచే ఊమెన్ చాందీ’ పేరుతో ప్రమాణం చేసిన విషయాన్ని కూడా కోర్టు పరిశీలించింది.
ప్రమాణ స్వీకారం అనేది కేవలం ఒక లాంఛనం కాదని, ఎన్నికైన ప్రతినిధి రాజ్యాంగం, చట్టాలకు కట్టుబడి ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తానని చేసే గంభీరమైన ప్రతిజ్ఞ అని హైకోర్టు పేర్కొంది. చట్టం ప్రకారం ప్రమాణం దేవుని పేరు మీద లేదా దేవుని ప్రస్తావన లేకుండా గంభీరమైన ప్రతిజ్ఞ రూపంలో మాత్రమే చేయాలని, వ్యక్తిగతంగా ఇతర పేర్లు లేదా పదాలను జోడించడం అనుమతించబడదని స్పష్టం చేసింది.
నాలుగు వారాల్లో తిరిగి ప్రమాణం చేయాలని ఆదేశం
ప్రమాణ స్వీకారాలు చట్టబద్ధమైన విధానంలో జరగనందున అవి చెల్లుబాటు కావని హైకోర్టు పేర్కొంది. అయితే, కేవలం ఈ కారణంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవులు రద్దు కావని స్పష్టం చేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కౌన్సిలర్లు, వడక్కంచేరి గ్రామ పంచాయతీ సభ్యుడు నాలుగు వారాల్లోగా చట్టప్రకారం తిరిగి ప్రమాణ స్వీకారం చేయాలని ఆదేశించింది. అలాగే, వారు చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఈ విధంగా ప్రమాణం చేసి ఉండవచ్చని భావించి, వారిపై ఎటువంటి శిక్ష లేదా జరిమానా విధించలేదు.
కేరళ మున్సిపాలిటీ చట్టంలోని సెక్షన్ 531 ప్రకారం, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు ఇప్పటివరకు తీసుకున్న అధికారిక నిర్ణయాలు చెల్లుబాటుగానే ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అయితే, కేరళ పంచాయతీ రాజ్ చట్టంలో ఇలాంటి రక్షణ నిబంధన లేకపోవడంతో, వడక్కంచేరి గ్రామ పంచాయతీ సభ్యుడు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు చట్టబద్ధత కోల్పోయే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ, ఆయనకు కూడా తిరిగి చట్టబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించింది.





