
భారతీయ మహిళలు మన ప్రాచీన సంస్కృతిని కాపాడుతూనే, ఆధునిక సాంకేతికతతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఆశయాలను నిజం చేస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం మొదట వీరిపైనే పడుతున్నా, వీరు కేవలం బాధితులుగా మిగిలిపోకుండా పర్యావరణ ఉద్యమాలకు, హరిత మార్పులకు నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సహజసిద్ధమైన జీవనశైలిని, తరాల నాటి సంప్రదాయాలను కాపాడుతూనే కొత్త పద్ధతుల ద్వారా పర్యావరణాన్ని కింది స్థాయి నుండి కాపాడుతున్నారు.
విజ్ఞానాన్ని, సంప్రదాయాన్ని జోడించి నేటి మహిళలు వినాయక చవితి, దీపావళి వంటి పండుగలకు రసాయన రంగులు లేకుండా మట్టి గణపతులు, విత్తన ప్రసాదాలను వాడుతూ ప్లాస్టిక్ రహిత సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. తులసి, రావి, వేప చెట్లను పూజించే సాంస్కృతిక అలవాటును కొనసాగిస్తూనే, ఇళ్లలోనే వర్టికల్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ పెంచుతూ పచ్చదనాన్ని పంచుతున్నారు. మరోవైపు గ్రామీణ మహిళలు హైబ్రిడ్ విత్తనాలకు దూరంగా, కరువును తట్టుకునే పాతకాలపు నాటు విత్తనాలను సేకరించి భద్రపరుస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నారు.
గృహ నిర్వహణలో భాగంగా వంటింటి తడి చెత్తను పారేయకుండా, నేడు ఆధునిక కంపోస్టింగ్ బిన్స్ ద్వారా ఇళ్లలోనే వాసన లేని సేంద్రీయ ఎరువుగా మారుస్తున్నారు. అలాగే వాషింగ్ మెషీన్లు, ఆరఓ ప్యూరిఫైర్ల నుండి వచ్చే వృధా నీటిని స్మార్ట్ పైప్‌లైన్స్ ద్వారా మొక్కలకు మళ్లించి జల సంరక్షణ చేస్తున్నారు. గ్రామాల్లో కూడా మహిళలు బావులు, చెరువుల వద్ద నీటిని వృధా చేయకుండా వాడుకుంటూ, వర్షపు నీటి నిల్వ కోసం చిన్న చిన్న గుంతలు తవ్వడంలో ముందుంటున్నారు.
ఫ్యాషన్ రంగంలో కూడా పర్యావరణానికి హాని చేసే సింథటిక్ దుస్తులను పక్కన పెట్టి, మన సాంప్రదాయ ఖాదీ, కాటన్, జనపనార వస్త్రాలను ఆధునిక డిజైన్లలోధరిస్తున్నారు. పాత పట్టుచీరలు, కాటన్ దుస్తులను పారేయకుండా వాటితో ల్యాప్‌టాప్ బ్యాగులు, కుర్తీలు, హోమ్ డెకర్ వస్తువులుగా మార్చి అప్‌సైక్లింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో ఈనాటికీ మార్కెట్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచులను వాడటం, శుభకార్యాలలో విస్తరాకులు, మట్టి పాత్రలను ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని సాధ్యమైనంత నిరోధిస్తున్నారు.
మరోవైపు, ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లకు ప్రత్యామ్నా యంగా బాదం ఆకులు, విస్తరాకులు, జనపనార సంచులను తయారు చేసే గ్రీన్ స్టార్టప్స్‌ను మహిళా పారిశ్రామికవేత్తలే విజయవంతంగా నడుపుతు న్నారు. గ్రామాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs) సామూహికంగా బంజరు భూముల్లో మొక్కలు నాటడం, వాటిని చెట్లుగా పెంచే బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
మన సమాజంలో మరింత వేగంగా పర్యావరణ మార్పు తీసుకురావడానికి మహిళలు మరికొన్ని కీలకమైన అడుగులు వేయవచ్చు. చిన్నప్పటి నుంచే నీటిని ఆదా చేయడం, మొక్కలను ప్రేమించడం, ప్లాస్టిక్ వాడకపోవడం వంటి ‘గ్రీన్ హాబిట్స’ని పిల్లలకు నేర్పే గురువులుగా మహిళలు మారాలి. కాలేజీలు, ఆఫీసుల్లో పనిచేసే మహిళలు కార్ పూలింగ్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు, కాలేజీ విద్యార్థి నులు కలిసి స్థానిక కాలనీల్లో చెత్తను వేరు చేయ డంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించ వచ్చు. ప్రతి శుభకార్యానికి, పుట్టినరోజులకు ఖరీదైన ప్లాస్టిక్ బహుమతులు ఇచ్చే బదులు, మొక్కలను కానుకలుగా ఇచ్చే సంస్కృతిని మరింత విస్తృతంగా పెంచవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రీల్స్ ,వీడియోల ద్వారా ‘జీరో వేస్ట్ లైఫ్‌స్టైల’ ఎలా సాధ్యమో చూపించి ఇతరులకు రోల్ మోడల్‌గా నిలవవచ్చు. ఇలాంటి మార్పులు మహిళల చేతుల మీదుగా జరిగితే పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమంలా మారుతుంది.





