
రాష్ట్ర సేవికా సమితి నాలుగో ప్రముఖ సంచాలిక వందనీయ ప్రమీల తాయీ మేఢే జీ కార్యకర్తలందరికీ ఎంతో వాత్సల్యాన్ని పంచారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరంసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సేవికా సమితి విస్తరణ కోసం పెద్ద తపస్సే చేశారన్నారు. సేవికా సమితి నాలుగో ప్రముఖ సంచాలికగా బాధ్యతలు నిర్వహించిన ప్రమీలా తాయి మేఢే జీ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మేఢే జీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. సమితి ప్రారంభం నుంచి దేశం కోసం పనిచేస్తూ వచ్చారని, అత్యంత కఠిన పరిశ్రమ చేశారన్నారు. ఉత్తర పూర్వాంచల్ ప్రాంతంలో అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి, కఠిన పరిస్థితులను ఎదుర్కొని, సేవికా సమితి కార్యకర్తలతో పనిచేశారని గుర్తు చేశారు. తాను ఎప్పుడు కలిసినా.. అత్యంత ప్రేమతో మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు.
ఇంతటి ఉన్నతమైన వ్యక్తి పరమపదించారని, కానీ.. వారి ధ్యేయపరమైన జీవితం నిత్యం ప్రేరణను ఇస్తూనే వుంటుందన్నారు.ధ్యేయ నిష్ఠ కోసం ఎలా పరిశ్రమ చేయాలి? ఎలా పరిశ్రమ చేయాలో ప్రమీలా తాయీ జీవితం ఆదర్శమని పేర్కొన్నారు.ఆమె తన శరీరాన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్ కి దానంగా సమర్పించారన్నారు. అయితే ఆమె చేసిన తపస్సు కారణంగా సద్గతులు పొందడం ఆమె హక్కు అని, ప్రమీలా తాయి జీవితం అందరికీ ప్రేరణనిస్తుందని మోహన్ భాగవత్ అన్నారు.





