News

రెండు నెలలు గడుస్తున్నా.. భారత్ దెబ్బకు పాక్ రిపేర్లు..

284views

పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌ గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బకు పాకిస్థాన్ ఇప్పటికీ రిపేర్లు చేసుకుంటూనే ఉంది. ఆ ఆపరేషన్ జరిగి రెండు నెలలు దాటినా.. రహీమ్ యార్‌ ఖాన్ ఎయిర్‌బేస్‌ వద్ద ఉన్న ఒకే ఒక్క రన్‌వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దాని మూసివేతను మూడోసారి పొడిగించింది.

ఆగస్టు 5 వరకు రన్‌వే మూసివేసి ఉంటుందని పాకిస్థాన్‌ తాజాగా నోటమ్‌ విడుదల చేసింది. విమానయాన కార్యకలాపాలు అందుబాటులో ఉండవని పేర్కొంది. అయితే ఆ మూసివేతకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా మే 10న భారత్‌ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటమ్ జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌ ఒక వారం పాటు అందుబాటులో ఉండదని చెప్పింది. ఆ తర్వాత గత నెల నాలుగున రెండో నోటమ్ జారీ చేసింది. ఆ మూసివేతను జులై 4 వరకు పొడిగించింది. తాజాగా దానిని ఆగస్టు 5కు పెంచింది. భారత్‌ దాడులతో ఆ ఎయిర్‌బేస్‌ రన్‌వేపై పెద్ద గొయ్యి ఏర్పడినట్లు కొన్ని మీడియా చిత్రాలను బట్టి తెలుస్తోంది. దగ్గర్లోని ఒక భవనం కూడా ధ్వంసమైంది.

ఈ స్థావరంలో షేక్ జాయెద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కూడా ఉంటుంది. దాంతో దీనిని పాక్‌ రెండు విధాలుగా ఉపయోగించుకుంటోంది. ఈ ఎయిర్‌బేస్‌తో పాటు మరో 10 మిలిటరీ సైట్లను కూడా భారత్ టార్గెట్ చేసింది. ఆ తర్వాతే పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎయిర్‌బేస్‌ గురించి మన ప్రధాని మోదీ కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పాక్‌లోని రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్ (Air base) ఐసీయూలో ఉందని రాజస్థాన్‌లోని ఓ సభలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.