
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం నుండి ప్రారంభమైయ్యాయి. ఈ సందర్బంగా అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు , మల్లేశ్వర స్వామివారి ఆలయం, ఇతర ఉపాలయాలను, దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో అలంకరించారు. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ మాట్లాడుతూ, శాకంబరిమాతగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నామని చెప్పారు. ఈ శాకంబరీ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు.
ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు మూడు రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు.ఆలయ పూజారులు, వలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లతో ఇంద్రకీలాద్రి కళకళలాడుతోంది. ఇవాళ ఉదయం 08-00 నిమిషాలకు విఘ్నేశ్వర పూజ, రుత్విక్ వరుణ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు.సాయంత్రం 04-00నిమిషాలకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ జరుగనుంది. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద భక్తులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు ఆన్‌లైన్ బుకింగ్‌లో ఆలయ అధికారులు మార్పులు చేశారు.





