
నౌకాదళంలో మహిళా ఫైటర్ పైలట్ల చేరికతో కొత్త శకం ఆరంభమైందని.. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ జనక్ బెల్వీ అన్నారు. నేవీ ఏవియేషన్‌లో ఆస్తా పూనియా దేశంలోనే తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారని ప్రశంసించారు. ఆమె భవిష్యత్తులో మిగ్-29కె లేదా నౌకాదళ రఫేల్ యుద్ధ విమానాలను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి ముందు ఆమె యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందుతారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు చెందిన నేవల్ ఎయిర్‌స్టేషన్ ‘ఐఎన్‌ఎస్ డేగా’లో జరిగిన రెండో ప్రాథమిక ‘హాక్ కన్వర్షన్ కోర్సు’ ముగింపు వేడుకల్లో ‘వింగ్స్ ఆఫ్ గోల్‌్్డ’ పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనక్ బెల్వీ మాట్లాడుతూ.. భారత నౌకాదళంలో ఇప్పటికే మహిళా అధికారులు పైలట్లుగా సముద్ర నిఘావిమానాలు, హెలికాప్టర్లలో విధులు నిర్వర్తిస్తున్నారని, అయితే నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళగా ఆస్తా పూనియా చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పారు. అనంతరం హాక్ కన్వర్షన్ కోర్సులో ప్రతిభ చూపిన లెఫ్టినెంట్ అతుల్‌కుమార్ దుల్, సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియాలకు ప్రతిష్ఠాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాలు అందజేశారు.





