
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. చాలా మంది ఇది పూర్తి హిందువుల కోసం మాత్రమే పనిచేస్తున్న సంస్థగా పొరపడుతుంటారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడూ ముస్లింలకు, మైనారిటీలకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని పలు సందర్భాల్లో రుజువు చేసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మైనారిటీ, మెజారిటీ అనే ద్వందత్వాన్ని నమ్మదు. ప్రజలు పలు మతాలను అనుసరిస్తుండవచ్చు, కానీ ధర్మం మాత్రం ఒక్కటే. అది హిందూ ధర్మం అని నమ్ముతుంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…. ధర్మం అనేది భారత జీవన విధానానికి, శాశ్వతమైన నాగరిక విలువలను సూచిస్తుంది. దీనికి పూజలతో, ప్రార్థనలతో సంబంధం లేదు. చర్చికి, మసీదుకు వెళ్లేవారు, ఆలయానికి వెళ్లే వారితో సమానం అంటుంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హిందువులు కానివారితో ఎక్కువగా పని చేయాలని అనేక సార్లు పిలుపునిచ్చారు. కార్యకర్తలను ఒక సమ్మిళత సంఘంగా చూడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ కోరారు. ఇటీవల లక్నోలో జరిగిన సమావేశంలో … ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, ఇతర మతాల వారి మధ్య పనిచేయాలని హిందువులకు పిలుపునిచ్చారు. సామాజిక స్నేహం ఎజెండాలో భాగంగా హిందూయేతరులకు దగ్గర కావాలని ఆయన ఆకాంక్షించారు. సంఘ్ పరివార్ ఈ విషయంలో దీర్ఘ కాలిక లక్ష్యంతో పనిచేయాలని భాగవత్ స్పష్టం చేశారు.
సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చాలా మంది ప్రయత్నించారు, చివరకు వారే కనుమరుగయ్యారు. సనాతన ధర్మం శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. సమాజంలోని తప్పుడు పద్దతులను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందుకు సనాతన సహకరిస్తుంది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు ఇస్తోంది. అనేక సమస్యలు ఉన్నా, భారత్ సరైన మార్గంలో ఉందని భాగవత్ పలు మార్లు గుర్తుచేశారు. మార్క్సిజం పేరుతో ప్రపంచానికి విధ్వంసం తెచ్చారని భాగవత్ ఇటీవల తమిళనాడు ఘటనను ఉద్దేశిస్తూ అన్నారు. వామపక్ష భావజాలం, స్వార్థ పూరిత రాజకీయాల నుంచి భారతదేశాన్ని రక్షించాల్సిన అవసరాన్ని భాగవత్ గుర్తుచేశారు. తప్పుడు ఆదర్శాల వల్ల కలిగే సంక్షోభం నుంచి దేశాన్ని రక్షించుకోవాలని భాగవత్ తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్లాలిన్ సనాతన విమర్శలపై స్పందించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యతిరేకలు, ఈ సంస్థను మైనారిటీలకు వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. మైనారిటీలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేయలేదని భాగవత్ చెప్పారు. హిందుత్వాన్ని భారతీయుల్లో ఐక్యతా భావాన్ని పెంచడానికి ఒక సాధనంగా మార్చారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా హిందుత్వను అనుసరించాలని భాగవత్ పలు సందర్భాల్లో కోరారు. ప్రజలను ఒకరితో ఒకరిని అనుసంధానించుకోవాలన్నారు. సంప్రదాయకంగా చూసినప్పుడు అన్ని మతాలు ఒకే గమ్యస్థానికి దారితీస్తాయని భాగవత్ పేర్కొన్నారు. దేశంలోని ముస్లింలు, క్రీస్టియన్లలో 99 శాతం మంది మతం మార్చబడిన వారేనని ఆయన గుర్తుచేశారు. వీరంతా భారత మూలాలు కలిగి ఉన్నారని భాగవత్ చెప్పారు.
భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు పూర్వం హిందూ జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా జీవించారు. వేల సంవత్సరాలుగా ఆరాధన విధానాలు మార్పు చెందాయి. విశ్వాసం, ఆరాధన విషయాల్లో ఎటువంటి వివక్ష లేదు. భారతీయుడిగా పుట్టడం, జీవించడం అనేది గొప్ప ఆధ్యాత్మక విధానం. ముస్లింలు, క్రిస్టియన్లు దేశంలో తమ విశ్వాసాలను, ఆచారాలను బహిరంగంగా, స్వేచ్ఛగా ఆచరిస్తున్నారు. భారతీయీకరణ అంటే అందరినీ హిందువులుగా మార్చడం కాదనే విషయాన్ని రెండో సంఘ్ చాలక్ చెప్పారు. మనందరం ఈనేల పిల్లలం. దేశం పట్ల విధేయత కలిగి ఉండాలి. మనందరం ఒకే సమాజానికి చెందిన వారం. మన పూర్వీకులు ఉమ్మడిగా జీవించారు. అది అర్థం చేసుకోవాలి. అందులోనే భారతీయీకరణ దాగి ఉంది. భారతీయీకరణ అంటే ఒకరు ఆచరిస్తున్న మతాన్ని విడిచిపెట్టమని కాదు అనే విషయాన్ని రెండవ సంఘ్ చాలక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.





