
( జూన్ 21 – ప్రపంచ యోగా దినోత్సవం )
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014 నవంబరులో ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఆయుర్వేదం, యోగా వంటి ఏడు సంప్రదాయ భారతీయ పద్ధతులను ప్రజారోగ్య సంక్షేమ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. 2014 డిసెంబరు నాటికి ఐక్యరాజ్యసమితిలోని 177 దేశాలు కలిసి యోగా ఆవశ్యకతను అంగీకరించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరిపేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి.
2016 జూన్‌లో అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ..యోగా విషయంలో భారతదేశం మేధోసంపత్తి హక్కులను తీసుకోలేదని, భారతీయ జ్ఞాన సంపద సమస్త మానవాళికి నిరంతరం అందుబాటులోనే ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం భారతదేశం ఇచ్చిన విలువైన కానుక యోగా అని వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపైన ప్రధానమంత్రి బహిరంగంగానే వెల్లడించారు. యోగాలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి సనాతన జీవన విధానం నుంచి వారసత్వంగా వస్తోంది. ఆదియోగి అయిన పరమేశ్వరుడు యోగాను మొదటిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, భారతీయతత్వం ప్రతిపాదిస్తున్న సార్వత్రిక విలువల్లాగే యోగా కూడా విశ్వవ్యాప్త భావనను, ప్రాపంచిక దృక్పథాన్ని బోధిస్తుంది. అందుకే యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు, ఆమోదం లభించింది.
శతాబ్దాల క్రితం అత్యంత ప్రజాదరణ పొందిన సంస్కృత కవులలో ఒకరైన భర్తృహరి, యోగా ప్రత్యేకతను తెలియజేస్తూ
ధైర్యం యస్య పితా క్షమా చ జననీ శాంతిశ్చిరం గేహినీ
సత్యం సూనురయం దయా భగతా!! మన: సంయమ:
శయ్యా భూమితలం దిశోస్పి వసనం జ్ఞానామృతం భోజనం ఏతే
యస్య కుటింబినదశ: !! భయం యోగిన:
అంటే, క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి తండ్రిలా రక్షించే ధైర్యం, తల్లిలా క్షమ, శాశ్వత స్నేహితుడిగా మారే మానసిక ప్రశాంతత వంటి కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవచ్చు. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం ద్వారా సత్యం మన బిడ్డగా, దయ మన సోదరిగా, స్వీయ నియంత్రణ మన సోదరుడిగా మారతాయి. భూమి మన మంచం అవుతుంది. జ్ఞానం మన ఆకలిని తీరుస్తుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే, యోగా మనలో సామూహిక చైతన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఐక్యత, స్థైర్యాన్ని పెంచుతుంది. జమ్ముకాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో యోగా శిబిరాలు యువతలో మానసిక ఒత్తిడిని తగ్గించి అతివాదం నుంచి దూరం చేస్తున్నాయి. ఈ ఏడాది ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా నినాదంతో ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నినాదం కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుంది.





