News

”మోదీ రాజకీయాలను చంపేస్తాం’’ : మితిమీరిన ఖలిస్తానీల హెచ్చరికలు

195views

జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలోని కాల్గరీ నగరానికి చేరుకున్నారు. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.‘‘మోదీ శైలి రాజకీయాలను అంతం చేస్తాం.. కెనడాను సురక్షితంగా వుంచండి’’ అంటూ వివాదాస్పద ప్రకటనలు చేశారు. ఈ మేరకు కాల్గరీ అనే ప్రాంతంలో వందలాది మంది ఖలిస్తానీలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలన్నింటికీ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) నాయకత్వం వహించింది. ఈ ప్రదర్శన కాల్గరీలోని దశమేష్ గురుద్వారా నుంచి ప్రారంభమైంది.

అయితే ఖలిస్తానీలిచ్చిన ఈ నినాదంపై భారత్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. ‘‘మోదీ శైలి రాజకీయాలను అంతం చేయండి’’ అంటే.. భౌతికంగా చంపడానికి పిలుపునిస్తున్నట్లా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భారత ప్రధాని ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని దీంతో చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న అనుమానాలతో ఖలిస్తానీలు.. ముందర ‘‘రాజకీయాలు’’ అన్న పదాన్ని జోడించారన్న విమర్శలు వస్తున్నాయి. కెనడా కేంద్రంగా వుంటూ మోదీ తరహా రాజకీయాలను ఎలా చంపుతారు? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇది అసంబద్ధ నినాదమని పలువురు మండిపడుతున్నారు.

ఈ సమయంలో ఖలిస్తానీలు భారీ వాహనాలతో ఓ కాన్వాయ్ మాదిరిగా రోడ్లపైకి వచ్చారు. మోదీ వున్న బ్యానర్లు, పోస్టర్లను ప్రదర్శించారు. ఓ రకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ పోస్టర్లు, నినాదాలు కూడా ఇచ్చారు.ఈ క్రమంలో చిన్నారులను అడ్డం పెట్టుకుని భారత జాతీయ పతాకాన్ని అవమానించడం, ప్రధాని మోదీ చిత్రపటాలపై దాడులు చేయించడం వంటి దారుణమైన చర్యలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఓ ఖలిస్థానీ ఉగ్రవాది ప్రధాని మోదీని ఉద్దేశించి తీవ్ర బెదిరింపులకు దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతదేశమే కారణమని నిరసనకారులు ఆరోపించారు.

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు కొందరు ఆరుగురు చిన్నారులను రెచ్చగొట్టి, భారత జాతీయ జెండాను అపవిత్రం చేయించడంతో పాటు, ప్రధాని మోదీ చిత్రపటాలను కాళ్లతో తన్నేలా ప్రోత్సహించినట్లుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ దృశ్యాలలో పెద్దలు కొందరు కెమెరాకు దూరంగా ఉంటూ పిల్లలను ఈ దిగజారుడు చర్యలకు ఉసిగొల్పడం స్పష్టంగా కనిపించింది.

ఖలిస్తానీల తీవ్ర నిరసన ప్రదర్శనలపై భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. ‘‘మోదీ రాజకీయాలను చంపండి’’ అంటే ఏమిటి? దీనిపై ఖలిస్తానీలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెనడాలోని ఇలాంటి శక్తులు భారత ప్రధానిని లక్ష్యంగా చేసుకొని, నిరసనలకు దిగడాన్ని అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరైన విధానం కాదన్నారు.

ఖలిస్తానీల నిరసనలు, వివాదాస్పద ప్రకటనపై భారతీయ సిక్కులు తీవ్రంగా మండిపడుతున్నారు. వారి చర్యలను, ప్రకటనలను ఖండించారు.

ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు మనిందర్జీత్ సింగ్ బిట్టా మాట్లాడుతూ, “విదేశాల్లో మన ప్రధానమంత్రిని దూషిస్తున్నప్పుడు భారత సిక్కు సమాజం మొత్తం ఎందుకు మౌనంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ సీనియర్ నేత మంజిందర్ సింగ్ సిర్సా పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “కెనడాలో సిక్కు చిన్నారులతో విద్వేషపూరిత చర్యలు చేయిస్తున్న ఘటనలు చూసి ప్రతి సిక్కు తీవ్ర ఆవేదన, సిగ్గుతో తలదించుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చిన్న పిల్లలను తాలిబన్ల ప్రచారాన్ని తలపించేలా వాడుకోవడం దిగ్భ్రాంతికరం.ఇది సిక్కు చిన్నారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, వారిలో ద్వేషాన్ని నింపి, సిక్కులను తీవ్రవాదులుగా చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా సిక్కుల ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది గురు గ్రంథ్ సాహిబ్ జీ బోధనలకు, మానవత్వ సేవ, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అనే సిక్కు మత మౌలిక సూత్రాలకు పూర్తిగా విరుద్ధం” అని అన్నారు.