News

సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర

0views

సేవాఘఢ్‌: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్‌ నుంచి ఢిల్లీ వరకు భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర చేపట్టినట్లు జోడో యాత్ర ట్రస్ట్‌ సభ్యులు డాక్టర్‌ ఎస్‌.కే. మహేష్‌ బంజారా, కర్ణాటకకు చెందిన వి. రామునాయక్‌ చౌహాన్‌ తెలిపారు.

శ్రీసత్యసాయి జిల్లా గుత్తి మండలంలోని సేవాఘఢ్‌లో ఉన్న సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారత్‌ గోర్‌ బంజారా జోడో యాత్ర ఫౌండర్‌ ట్రస్టీ, బంజారా జాతీయ నేత ఎస్‌.కే. యశవనాయక్‌ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా బంజారాలకు ఎస్టీ హోదా ఇవ్వాలి
ఈ సందర్భంగా జోడో యాత్ర ట్రస్ట్‌ సభ్యులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. బంజారా సమాజం హక్కులు, సంక్షేమం, రిజర్వేషన్ల అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

దేశవ్యాప్తంగా సుమారు 17 కోట్ల జనాభా కలిగిన బంజారాలు ఒకే భాష మాట్లాడుతున్నప్పుడు.. రిజర్వేషన్ల విషయంలో ఎందుకు భిన్నమైన విధానాలు ఉండాలని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా బంజారా సమాజాన్ని ఎస్టీ కేటగిరీలో చేర్చి న్యాయం చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంజారా సమాజ హక్కుల కోసం ఢిల్లీ వరకు యాత్ర కొనసాగించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపిస్తామని తెలిపారు.