
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు
అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్వ ఆయుర్వేద పరిషత్, వరము ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన చరక జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ధన్వంతరి హవనం నిర్వహించారు.
చరక జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత పంచకర్మ చికిత్సా శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇందులో 200 మందికి పైగా రోగులకు మాత్రా వస్తి రెండో డోస్ అందించగా, మరో 200 మందికి పైగా రోగులకు ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు అందించారు.
వస్తి కర్మతో ప్రయోజనాలు
కర్ణాటక ఆయుష్ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ డా. ఎన్. ఆంజనేయమూర్తి వస్తి కర్మ వల్ల కలిగే ప్రయోజనాలను రోగులకు వివరించారు. చికిత్స అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు, జీవనశైలికి సంబంధించిన సూచనలను అందించారు.
ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా. సుందర్‌రాజ్ పెరుమాళ్ వెన్నెముక సమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, క్షీణత సంబంధిత వ్యాధులు, కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన ఆహార మార్పులపై అవగాహన కల్పించారు.
చరక జయంతి వేడుకల్లో భాగంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయుర్వేద చికిత్సా విధానాలు, ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.





