News

ఆలయంలో అసాంఘిక కార్యకలాపాలు

280views

వైయస్సార్ కడప జిల్లా పుష్పగిరి.. ఎంతో చరిత్ర కలిగిన మహా క్షేత్రమిది. ఇక్కడి దేవుడిపై భక్తులకు ఎంతో నమ్మకం. కోరిన కోరికలు నెరవేరుస్తాడని పేరు. అందుకే ఇక్కడి చెన్నకేశవస్వామి భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రం పవిత్రతను కొందరు దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. దేవుడి చెంత దెయ్యం పనులకు పాల్పడుతూ మనోభావలతో చెలగాటమాడుతున్నారు.

అనుచరులమంటూ ఆగడాలు: పుష్పగిరి ఆలయం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. సదరు అధికారుల అనుమతితో ఒకే ఒక అర్చకుడు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సదరు అర్చకుని అనుచరులమంటూ ఇటీవల కొందరు పుష్పగిరి పైకి చేరారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రాంగణంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ధూమపానం, మద్యపానం చేస్తున్నారు. మాంసాహారం భుజిస్తున్నారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులకు కనిపించేలా లోదుస్తులు ప్రాంగణంలో బహిరంగంగా ఆరబెడుతున్నారు. ఆలయంలోని సత్రాలకు తడికెలను అడ్డుగా ఉంచి అందులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అదేమని అడిగిన వారికి తాము ఆలయ అర్చకుని వ్యక్తిగత మనుషులమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి ఆలయ ప్రాముఖ్యతను కాపాడేలా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు.

ఈ విషయంపై జిల్లా దేవదాయ శాఖ కమిషనర్‌ మల్లికార్జున ప్రసాద్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరింది. ఆయన మాట్లాడుతూ.. అధికారుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఆలయ ప్రాంగణంలో ఉండకూడదన్నారు. అర్చకులు తనకు ఇష్టం వచ్చినట్లు సహాయకులుగా నియమించుకునే అధికారం లేదని చెప్పారు. సత్రాల్లో నివాసం ఉంటున్న వాళ్లను వెంటనే ఖాళీ చేయిస్తామని తెలిపారు.