
వేసవి సెలవులు ముగిసి పాఠశాలల్లోకి అడుగుపెట్టే సమయమిది. బతుకు పాఠాలు నేర్చుకునే చదువులమ్మ చెట్టు నీడలోనే విలువలకూ బీజం పడేది. గురుకులం లాంటి వాతావరణంలో పిల్లలు జ్ఞానాన్ని ఆర్జించాలని మన ధర్మ గ్రంథాలు సూచించాయి. విజ్ఞానంతో పాటు వినయం, వివేకం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాలను పెంచే లౌకిక, పారమార్థిక విద్యలను అభ్యసించినప్పుడే పరిపక్వత, పరిపూర్ణత సిద్ధిస్తాయని అవి స్పష్టం చేశాయి.
భక్తితత్పరుడైన ప్రహ్లాదుడికి బడికి వెళ్లే వయసు ఆసన్నమైంది. పుత్రుణ్ణి తనలా రాజసంగా, దర్పంగా మార్చాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. గురువుల వద్దకు పంపి సకల శాస్త్రాలూ నేర్పించదలచాడు. ఓ మంచిరోజున ప్రహ్లాదుణ్ణి పిలిచి- ‘బాబూ! చదువు లేకుంటే అజ్ఞానులవుతారు. చక్కగా చదివితే తెలివితేటలు పెరుగుతాయి. ఏది మంచి, ఏది చెడు అనే వివేకం కలుగుతుంది. మంచి గురువుల దగ్గరకు పంపుతాను, చక్కగా చదువుకో నాయనా!’ అన్నాడు అనునయంగా. రాజగురువు శుక్రాచార్యుడి కుమారులైన చండ, అమర్కులను పిలిపించాడు. ఎప్పుడూ అహంకారం ప్రదర్శించే హిరణ్యకశిపుడు వాళ్లతో సౌమ్యంగా- ‘గురుపుత్రులు, గౌరవపాత్రులు అయిన మీరు మా శ్రేయోభిలాషులు. మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాను. సకల శాస్త్రాలూ నేర్పించి, వృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత మీదే’ అన్నాడు.
పిల్లల్ని విద్యాభ్యాసానికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో హిరణ్యకశిపుడు ఆచరించి చూపాడు. రాక్షసుడైనా రత్నాల్లాంటి పలుకులు పలికాడు. అది నేటికీ ఆదర్శమే. తామెంత పెద్ద హోదాలో ఉన్నా విద్యాలయానికి వెళ్లినప్పుడు నిగర్వంగా మెలగాలి, మహారాజులైనా, యువరాజులైనా ఆచార్యుల వద్ద అణకువతో ఉండాలి- అనే ధర్మాన్ని హిరణ్యకశిపుడు చెప్పకనే చెప్పాడు.
వికాసానికి తోడ్పడేదే విద్య
‘చదువంటే మెదడును సమాచారంతో నింపటం కాదు. మనల్ని శారీరకంగా, మానసికంగా ధీరులుగా మలచేదే అసలైన విద్య’ అన్నారు స్వామి వివేకానంద. చదువు కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలను నియంత్రించేదిగా ఉండాలని ప్రబోధించాయి మన ధర్మగ్రంథాలు. గురుశిష్యులిద్దరూ కలసి చదివే ‘ఓం సహ నావవతు..’ అనే మంత్రం భగవంతుడు మనిద్దరినీ రక్షించుగాక! ఇద్దరమూ శక్తిమంతులమవుదము గాక!- అని చెబుతోంది. ఈ అధ్యయనం వల్ల తేజస్సు కలగాలి, ద్వేషభావం తొలగాలి- అని దీక్ష పూనాలి. శాంతి మంత్ర ప్రార్థనతో విద్యాభ్యాసాన్ని ప్రారంభించటం వెనుక ఉద్దేశమిదే! శారీరక, మానసిక స్థైర్య ధైర్యాలకు అచంచల శక్తి కావాలి. అందుకే గురుకులాల్లో ‘సహ వీర్యం కరవావహై..’ అని జ్ఞానయాత్రను ఆరంభిస్తారు. జ్ఞానం, శీలం సమాంతరంగా వృద్ధిలోకి వచ్చినప్పుడే విద్యకు సార్థకత అని మహర్షులు ఉద్బోధించారు. అలాగే ‘సా విద్యా యా విముక్తయే’- జనన మరణ దుఃఖాల నుంచి విముక్తిని కలిగించేదే నిజమైన విద్య అంటున్నాయి ఉపనిషత్తులు. జీవనకళను నేర్పేదే అసలైన విద్య అని పరోక్షంగా పేర్కొన్నాయి.
ఆదర్శ విద్యార్థి ప్రహ్లాదుడు
తండ్రి మాట ప్రకారం ప్రహ్లాదుడు గురుకులానికి వెళ్లాడు. పాఠాలన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకునేవాడు. వారెలా చెబితే ప్రహ్లాదుడు అలాగే చదివేవాడు. ‘అలా కాదు ఇలా’ అనే వాదన లేక అణకువగా ఉండేవాడు. విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఉపాధ్యాయులపై విశ్వాసం, గౌరవం. అవే వారిని ఉన్నతుల్ని చేస్తాయి. ఆ గుణాల్ని నూటికి నూరుపాళ్లూ అలవరచుకున్న ప్రహ్లాదుడు అనతి కాలంలోనే అత్యుత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ ప్రజ్ఞతో సకల శాస్త్రాల్లో నిష్ణాతుడయ్యాడు. తుదకు ‘దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు’ అని తండ్రికే విష్ణుమూర్తి ఘనతను గుర్తుచేశాడు.
చైతన్యపరిచేదే చదువు
విద్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించటంతో పాటు జడత్వాన్ని తొలగించాలి, రసజ్ఞతను పెంచాలి. అలాగే యోగాభ్యాసం, ధ్యానం వంటివి ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా విద్యను అభ్యసించేందుకు తోడ్పడతాయి. దక్షతను పెంచుతాయి. అందుకే ‘ఇంద్రియాలను ఎలా అదుపుచేసుకోవాలో, తోటివారితో ఎలా సామరస్యంగా మెలగాలో నేర్పే చదువు అవసరం’ అని గాంధీజీ అంటే.. ‘మనదేశం ప్రపంచంలో విశిష్టస్థానాన్ని సంపాదించటానికి ప్రధాన కారణం మన ఆధ్యాత్మికవిద్య. జ్ఞానాన్ని, కర్మని వేరు చేయకుండా సమపాళ్లలో రంగరించి నేర్పే పారమార్థిక విద్యతోనే అభ్యుదయం సాధ్యపడుతుంది. భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాల్లోని అంశాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నేర్పాలి’ అన్నారు ఆచార్య వినోబా భావే. కనుక జ్ఞానసముపార్జనతో పాటు ఉత్తమపౌరులుగా ఎదగటం ముఖ్యమని పిల్లలకు తర్ఫీదివ్వాలి. అలా అవగాహన కలిగించే అంశాలతో పాఠ్యపుస్తకాలు రూపొందించాలి.
వినయంతోనే విద్యకు వెలుగు
విద్య వినయంతో రాణిస్తుంది. మన సారస్వతంలో ఇలా మెరుగులు దిద్దుకున్న వజ్రాల్లాంటి విద్యార్థులెందరో! బృహస్పతి పుత్రుడు కచుడు. అతడు వినయశీలుడై శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి ‘మృతసంజీవని’ విద్యను ఆర్జించగలిగాడు. కచుడు తన ప్రత్యర్థి బృహస్పతి కుమారుడని తెలిసి కూడా శుక్రాచార్యులు అతని వినయవిధేయతలకు ముగ్ధుడై శిష్యుడిగా స్వీకరించాడు. ప్రత్యక్షంగా గురువుకు, పరోక్షంగా పరమాత్మకు చేరువ చేసే లక్షణం- అణకువ అని ప్రహ్లాదుడు, కచుడు తదితరులు నిరూపించారు. భగవంతుడి ఉనికి స్పష్టమయ్యేది సహృదయంలోనే. మనసును కఠినం చేస్తే.. అలాంటిదసలు చదువే అనిపించుకోదు. మనలో లాలిత్యాన్ని పెంచే పాఠశాల దేవాలయంతో సమానం. అందుకే తన వద్దకు వచ్చిన ఓ నిరక్షరాస్యుడైన భక్తుడితో- ‘చదువుతో పనేముంది, హృదయముంటే చాలు’ అన్నారు రమణ మహర్షి. నువ్వు శరీరం కాదు, ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవటమే అసలైన విద్య అన్నారాయన.
ఆధ్యాత్మిక జ్ఞానం స్థైర్యాన్నిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానసిక ఒత్తిడి, కుంగుబాటులకు తావుండదు. అందుకే అన్నమాచార్యులు ‘చదివి బతుకరో సర్వజనులు మీరు’ అన్న కీర్తనలో- ప్రహ్లాదుడు చదివినట్టి చదువు చదవమని హితవు పలికారు. నరసింహస్వామి ప్రత్యక్షమైన తర్వాత ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక సాధనలకే పరిమితం కాలేదు. గృహస్థ ధర్మాన్ని, రాజ్యపాలన బాధ్యతల్ని కూడా సమర్థంగా నిర్వహించాడు. గొప్ప చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నాడు. తొలుత అన్ని జ్ఞానాలకు మూలమైన పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించాలని నిరూపించాడు. ఆధ్యాత్మిక జ్ఞానం, అంతర్యామికి సంబంధించిన చదువు అన్ని విద్యలకు మూలమై నిలుస్తుంది. ‘విద్యల్లో నేను ఆధ్యాత్మిక విద్యను’ అన్నాడు గీతలో శ్రీకృష్ణభగవానుడు. మన ధర్మం లౌకిక, పారలౌకిక జ్ఞానాలను భిన్నంగా చూడలేదు. పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ప్రాపంచిక జ్ఞానానికి కూడా ఆధారమై నిలుస్తుందని స్పష్టమవుతుంది.





