News

ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం – ‘ఐఎస్ఐ’తో సంబంధాలున్న మధ్యప్రదేశ్ యువకుల అరెస్టు!

31views

మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన ముగ్గురు యువకులను పాకిస్తానీ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’తో సంబంధాల ఉన్న ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.

దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు ఢిల్లీలోని చారిత్రక దేవాలయాలు, ఢిల్లీ-సోనిపత్ హైవేపై ఉన్న ఒక ధాబా, అలాగే హర్యానాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు సమాచారం పంపినట్లు ఆరోపణ

ఢిల్లీ స్పెషల్ సెల్ ఇన్‌స్పెక్టర్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం, నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా అనుమానాస్పద విదేశీ నంబర్లతో ఆడియో, వీడియో కాల్స్ జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా, కొన్ని కీలక ప్రాంతాల ఫోటోలు మరియు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు పంపినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఇక అనుమానాస్పద ఈ-మెయిల్స్ కూడా లభించాయని, ఉగ్రవాద కుట్రల్లో పాల్గొనడానికి వీరికి ఎలాంటి ప్రలోభాలు లేదా ఆర్థిక సహాయం అందించబడిందనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని తెలిపారు.

‘గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0’లో సంచలన వివరాలు

‘గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో, వివిధ రాష్ట్రాలకు చెందిన షాజాద్ భట్టి గ్యాంగ్‌కు సంబంధించి మొత్తం 9 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

వారి విచారణలో, ఢిల్లీలోని ఒక ప్రముఖ హిందూ ఆలయంపై ముందస్తు నిఘా (‘రేకీ’) నిర్వహించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆలయం పరిసరాల ఫోటోలు మరియు భద్రతా వివరాలను పాకిస్థాన్‌కు పంపినట్లు సమాచారం. అనంతరం, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు మరియు పారామిలిటరీ బలగాలపై దాడి చేసి భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

దేశ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద నెట్వర్క్‌లు సోషల్ మీడియా మరియు యువతను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే అంశంపై భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. దేశ భద్రత, ముఖ్యంగా హిందూ ఆలయాలు మరియు సైనిక కేంద్రాల రక్షణ విషయంలో మరింత కఠిన చర్యలు అవసరమని జాతీయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.