
అనంతపురం నగరంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రవేశ్ శిక్షా వర్గ కార్యక్రమాల సందర్భంగా గురువారం (14-05-2026) “పథ సంచలన్” నిర్వహించబడింది. సంప్రదాయ క్రమశిక్షణ, దేశభక్తి భావాలు, సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ పథ సంచలన్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
నగరంలోని లేడీస్ క్లబ్ ప్రాంగణం వద్ద ప్రారంభమైన పథ సంచలన్ టవర్ క్లాక్, డీసీమ్స్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, సప్తగిరి సర్కిల్, ధర్మవరం రోడ్ సర్కిల్ మీదుగా శోభాయమానంగా కొనసాగింది. సంపూర్ణ గణవేషంలో పాల్గొన్న సేవికలు క్రమశిక్షణతో అడుగులు వేస్తూ భారతీయ సంస్కృతి, సేవా భావం, సంఘటిత శక్తిని ప్రతిఫలింపజేశారు.
మార్గమంతా నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పథ సంచలన్‌కు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు. అనేక ప్రాంతాల్లో మహిళలు, యువతులు, భక్తులు పుష్పవృష్టి చేసి సేవికలను అభినందించారు. భారతమాత కీ జై, వందే మాతరం నినాదాలతో ప్రాంతమంతా దేశభక్తి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా రాష్ట్ర సేవికా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, మహిళల్లో దేశభక్తి, సేవా తత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే శిక్షా వర్గాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని, సంస్కృతి పరిరక్షణలో సేవికలు కీలక బాధ్యత నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.
పథ సంచలన్‌ను తిలకించేందుకు నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవికల క్రమశిక్షణ, సమన్వయాన్ని ప్రశంసించారు.




